Telugu Global
Telangana

సీడబ్ల్యూసీలో 'రెడ్డి' వర్గానికి చోటు ఇవ్వొద్దు.. పావులు కదుపుతున్న ఓ కీలక నేత!

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం సీడబ్ల్యూసీకే ఉండటంతో.. అందులో చోటు కోసం పలువురు సీనియర్లు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సీడబ్ల్యూసీలో రెడ్డి వర్గానికి చోటు ఇవ్వొద్దు.. పావులు కదుపుతున్న ఓ కీలక నేత!
X

కాంగ్రెస్ 85 వ ప్లీనరీ ఇటీవల చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికపై అగ్రనేతలు అందరూ చర్చించారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై అన్ని రాష్ట్రాల ఏఐసీసీ ప్రతినిధులకు దిశానిర్దేశనం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కంటే ముందే అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన సీడబ్ల్యూసీని రద్దు చేశారు. తాజాగా సీడబ్ల్యూసీని పునరుద్దరించి.. అందులో సభ్యులను నామినేట్ చేసే బాధ్యతను అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేపై పెట్టారు.

సీడబ్ల్యూసీ సభ్యుల కోసం ఎన్నిక జరిగితే తెలంగాణకు కనీసం రెండు స్థానాలు వస్తాయని చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు భారమంతా మల్లిఖార్జున్ ఖర్గే పైనే ఉండటంతో ఆయన ఎవరెవరిని అత్యున్నత కమిటీలోకి తీసుకుంటారో అనే డైలమా నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం సీడబ్ల్యూసీకే ఉండటంతో.. అందులో చోటు కోసం పలువురు సీనియర్లు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఖర్గేనే నామినేట్ చేస్తారని స్పష్టం కావడంతో.. అధిష్టానంపై తెలంగాణ నాయకులు ఒత్తిడి తీసుకొని వస్తున్నారు.

సీడబ్ల్యూసీలో చోటు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీ. హనుమంతరావు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహతో పాటు సీతక్క కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీలో 35 మంది సభ్యులు ఉంటారు. అయితే మాజీ అధ్యక్షుల హోదాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చోటు ఖరారు అయ్యింది. ప్రియాంక గాంధీకి కూడా సీడబ్ల్యూసీలో తప్పకుండా చోటు ఉంటుంది. ఇక జాతీయ అధ్యక్షుడి హోదాలో ఖర్గే ఎలాగో సీడబ్ల్యూసీలో ఉంటారు. దీంతో ఇక మిగిలేవి 31 స్థానాలు మాత్రమే.

సీడబ్ల్యూసీలో ఈ సారి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 15 లేదా 16 స్థానాలు మాత్రమే ఇతర కులాల వారిని వరించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీడబ్ల్యూసీలో చోటు ఖాయమే అనే చర్చ జరుగుతోంది. అయితే.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డి సామాజిక వర్గం డామినేషనే ఎక్కువగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు కూడా అదే వర్గానికి చెందిన వ్యక్తి. పైగా.. గత కొన్నేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల తరపున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టి. సుబ్బిరామిరెడ్డి, సంజీవరెడ్డి (ఐఎన్‌టీయూసీ కోటా) సీడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్నారు.

ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం.. సీనియర్ల వర్గం అంటూ రెండుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీడబ్ల్యూసీలో సభ్యత్వం కల్పిస్తే ఆయన మరో పవర్ సెంటర్‌లాగా తయారవుతారని.. ఇది తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతిని మరింత పెంచుతుందని అధిష్టానం భావిస్తోంది. అందుకే తెలంగాణ నుంచి ఇతర కులాల వారికి చోటు కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తోంది.

ఓబీసీ కోటాలో వీహెచ్‌తో పాటు ఎస్టీ కోటాలో సీతక్కను సీడబ్ల్యూసీలోకి తీసుకోవాలని తెలంగాణకు చెందిన ఓ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే వీరిద్దరి కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అత్యున్నత నిర్ణాయక కమిటీలో మరో రెడ్డి వ్యక్తి ఉండకూడదని స్వయంగా రేవంత్ రెడ్డే ఇలా ఒత్తిడి తెస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా.. సీనియర్ రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఒక జట్టుగా ఏర్పడ్డారని.. మరో రెడ్డి నాయకుడికి చోటిస్తే అది కాంగ్రెస్ పార్టీలో చీలికకు దారి తీస్తుందని కూడా అధిష్టానానికి తెలియజేసినట్లు తెలిసింది.

తెలంగాణలో మరో రెడ్డి నేత కీలకంగా మారకూడదని రేవంత్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీపీసీసీ పదవి కోసం ఆశించి భంగపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అసమ్మతి వర్గాన్ని నడిపిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. తమ వర్గంలో ఎవరో ఒకరికి సీడబ్ల్యూసీలో చోటు కల్పించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సీడబ్ల్యూసీలో 35 స్థానాల భర్తీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు కత్తి మీద సాములా మారింది. మరి తెలంగాణ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

First Published:  28 Feb 2023 11:01 AM GMT
Next Story