Telugu Global
Telangana

సీడబ్ల్యూసీలో తెలంగాణకు చోటు దక్కేనా.. ఖర్గే మనసులో ఏముంది!

జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మనసులో ఎవరు ఉన్నారనే ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అభిప్రాయాలు తీసుకుంటారని కూడా తెలుస్తున్నది.

సీడబ్ల్యూసీలో తెలంగాణకు చోటు దక్కేనా.. ఖర్గే మనసులో ఏముంది!
X

కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)లో తెలంగాణకు ఈ సారి ప్రాతినిథ్యం ఉంటుందా? లేదా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ దఫా సీడబ్ల్యూసీ సభ్యులను జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఎంపిక చేస్తారని పార్టీ స్పష్టం చేసింది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ 85వ ప్లీనరీ ఇవ్వాళ్టితో ముగియున్నది. కీలకమైన తీర్మానాలు చేయడంతో పాటు సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక కూడా ఇవ్వాలే ఉండనున్నది.

సీడబ్ల్యూసీలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఏపీ నుంచి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో సుబ్బిరామిరెడ్డి.. ఐఎన్‌టీయూసీ కోటాలో సంజీవ్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరికీ కొనసాగింపు ఉంటుందా లేదా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇక తెలంగాణ నుంచి చాలా మంది సీనియర్లు సీడబ్ల్యూసీలో చోటు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత చాలా మంది సీనియర్లు అసమ్మతి గళం వినిపించారు. ఇక్కడి కమిటీల్లో పని చేయడం కంటే ఏఐసీసీ పదవి ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు.

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వీ. హన్మంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ పదవులు ఆశిస్తున్నారు. తెలంగాణలో అసమ్మతి గళం వినిపించే వారికి ఏఐసీసీ పదవి ఇచ్చి వేరే రాష్ట్రానికి ఇంచార్జులుగా పంపితే సమస్య కాస్త తీరుతుందని హైకమాండ్ కూడా భావిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని చేస్తారనే చర్చ జరుగుతుంది. అప్పుడు ఆయన వేరే రాష్ట్రానికి ఇంచార్జిగా వెళ్లే అవకాశం ఉంటుంది.

కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు స్థానంతో పాటు హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు మరి కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో వేరే రాష్ట్రానికి ఇంచార్జిగా వెళ్తారా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. గతంలో సీడబ్ల్యూసీ కోసం ఎన్నికలు ఉండేవి. కానీ ఈ సారి కేవలం నామినేట్ మాత్రమే చేయనున్నారు. దీంతో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మనసులో ఎవరు ఉన్నారనే ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అభిప్రాయాలు తీసుకుంటారని కూడా తెలుస్తున్నది.

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉండటంతో తప్పకుండా సీడబ్ల్యూసీలో ఒకరికి చోటు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. సీడబ్ల్యూసీతో పాటు ఏఐసీసీ పదవుల్లో పలువురిని అకామిడేట్ చేస్తారని.. ఎన్నికల సమయంతో తప్పకుండా సీనియర్ల సేవలు అవసరం కాబట్టి వారికి ప్రాధాన్యత ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నది. మరి ఎవరికి ఈ అదృష్టం వరిస్తుందో చూడాలంటే సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే.

First Published:  26 Feb 2023 10:15 AM IST
Next Story