బండి సంజయ్‌ను తప్పించడం వెనుక చక్రం తిప్పింది ఎవరు? అసలు కారణం ఏంటి?
తన హయాంలో బీజేపీని విజయాల బాట పట్టించినా.. కీలకమైన ఎన్నికల సమయంలో తనను తప్పించడం పట్ల బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు సంబంధిత వార్తలు ఎన్నాళ్లుగానో మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందరూ ఊహించినట్లుగానే బండి సంజయ్‌ను పక్కన పెట్టి కిషన్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీకి నష్టమే కానీ.. కొంచెం అయినా లాభం ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కొన్ని వారాల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సమయంలో.. అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంతర్గతంగా కూడా చర్చ జరుగుతోంది. అయితే, బండి సంజయ్ తొలగింపు వెనుక ఒక వ్యక్తి చక్రం తిప్పినట్లు తెలుస్తున్నది.
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి హిందుత్వ ఎజెండాతో బండి ముందుకు దూసుకొని పోయారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా చేసుకొని పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మైలేజీ పెంచుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే పరిస్థితి కల్పించారు. దుబ్బాక, హుజూరాబాద్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అవి రెండూ వ్యక్తిగత విజయాలుగా ఆయా నాయకులు చెప్పుకున్నా.. అంతిమంగా అది తనదే అని బండి పదే పదే సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారు.
దీనికి తోడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ భారీగా కార్పొరేటర్లను గెలిపించుకున్నది. ఇది కూడా బండి విజయాల్లో ఒకటిగా ఆయన వర్గం చెబుతోంది. మునుగోడులో ఓడినా.. అక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇలా తన హయాంలో బీజేపీని విజయాల బాట పట్టించినా.. కీలకమైన ఎన్నికల సమయంలో తనను తప్పించడం పట్ల బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నారు. అన్నీ సక్రమంగా నడుస్తున్నాయని భావిస్తున్న సమయంలో బండిని తప్పించడం వెనుక ఒకరి హస్తం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన దగ్గర నుంచి అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఆ సమయంలో కొనుగోలుకు వచ్చిన ఏజెంట్లు.. బండి సంజయ్‌ను తీసిపారేసినట్లు మాట్లాడారు. బండి సంజయ్‌కు అసలు ప్రాధాన్యతే లేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రోజు బండి సంజయ్ యాదాద్రి వెళ్లి తడి బట్టలతో ప్రమాణం చేయడం. తనకు ఆ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో బీఎల్ సంతోశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పార్టీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్, ఇతర నేతలు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేయడానికి వెనుక బీఎల్ సంతోశ్ ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో కీలక నాయకుడైన బీఎల్ సంతోశ్ అండదండలు ఉండటంతోనే పలువురు రాష్ట్ర నాయకులు బహిరంగంగానే బండి సంజయ్‌పై విమర్శలు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికి తోడు పార్టీకి సంబంధించిన డబ్బును బండి సంజయ్ దుర్వినియోగం చేశారని.. పలువురు నాయకులకు టికెట్లు ఇస్తాననే హామీ ఇచ్చి.. భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో పలు విడతలుగా బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఆ యాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం పక్కన పెట్టి.. తన సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నించారని అధిష్టానం భావించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయకుండా.. ధనార్జనే లక్ష్యంగా బండి పని చేసినట్లు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వీటిన్నింటినీ బీఎల్ సంతోశ్.. అమిత్ షా, మోడీ, జేపీ నడ్డాకు చేరవేశారని తెలుస్తున్నది. ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ మొదటిగా జేపీ నడ్డాను కలిశారు. అక్కడే బండిపై వచ్చిన ఫిర్యాదుల చిట్టాను ముందు పెట్టినట్లు తెలుస్తున్నది. దానికి బండి సంజయ్ కూడా ఎలాంటి సమాధానం చెప్పలేక పోయారు. చివరకు నడ్డా ఆదేశాలతోనే బండి సంజయ్ రాజీనామా చేశారు.
మొత్తానికి ఎన్నికల ముందు బండి సంజయ్‌ను తప్పించడంలో బీఎల్ సంతోశ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. మరోవైపు ఆర్ఎస్ఎస్‌ను సంతృప్తి పరచడానికే కొత్త వ్యక్తికి కాకుండా కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారనే చర్చ జరుగుతోంది.