Telugu Global
Telangana

వైఎస్ షర్మిల విషయంలో చక్రం తిప్పింది ఎవరు?

ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు లోటస్‌ పాండ్‌లో ఆందోళన కూడా నిర్వహించారు.

వైఎస్ షర్మిల విషయంలో చక్రం తిప్పింది ఎవరు?
X

వైఎస్ షర్మిల విషయంలో చక్రం తిప్పింది ఎవరు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. తాము భేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆమె మీడియాకు వివరించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు లోటస్‌ పాండ్‌ వద్ద ఆందోళన కూడా నిర్వహించారు. మొదట్లో పోటీ చేస్తానని ప్రకటించి.. చివరకు విరమించుకోవడం ఆ పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఎవరినీ సంప్రదించకుండా, పార్టీలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉన్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇటీవల రాష్ట్రానికి వచ్చి క్రిస్టియన్ మత పెద్దలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. అక్కడే షర్మిల విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. షర్మిల బరిలో ఉంటే క్రిస్టియన్ల ఓట్లు కాంగ్రెస్‌కు పడవని చిదంబరం అంచనాకు వచ్చారు. దీంతో బ్రదర్ అనిల్ కుమార్‌తో మాట్లాడి బరి నుంచి తప్పుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్‌లో పార్టీ పరంగా మంచి పదవి కూడా షర్మిలకు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది.

ఖమ్మం, పాలేరు కలిపి దాదాపు 10 వేల వరకు క్రిస్టియన్ ఓటర్లు ఉంటారని అంచనా. దీంతో పాటు సికింద్రాబాద్‌లో కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో క్రిస్టియన్లు ఉన్నారు. షర్మిల పార్టీ బరిలో ఉంటే ఆ ఓట్లు చీలిపోతాయని, కాబట్టి పోటీ నుంచి తప్పుకొని మద్దతు ఇవ్వాలని చిదంబరం కోరినట్లు తెలిసింది. దీంతో బ్రదర్ అనిల్ కుమారే స్వయంగా వైఎస్ షర్మిలను ఒప్పించినట్లు సమాచారం.

First Published:  5 Nov 2023 12:30 PM IST
Next Story