Telugu Global
Telangana

వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం? క్లారిటీ వచ్చేసినట్లేనా!

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ షర్మిల స్వయంగా డీకే శివకుమార్ వద్దకు వెళ్లి కలిశారు.

వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం? క్లారిటీ వచ్చేసినట్లేనా!
X

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణమో క్లారిటీ వచ్చేసిందా? సొంత రాష్ట్రం ఏపీని వదిలి తెలంగాణలో రాజకీయాలు చేయడంపై మొదటి నుంచి వైఎస్ షర్మిల విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఆమె బీజేపీ వదిలిన బాణమని కొంత మంది.. కాదు ఆమె వెనుక కేసీఆర్ ఉన్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శల బాణాలు సంధించుకున్నాయి. ఆసక్తికరంగా ఆమె ఎవరు వదిలిన బాణమో చూచాయగా తెలిసిపోయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే ఆమె వెనుక ఉన్నారనే వార్తలకు బలం చేకూరుతున్నది. బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం అవుతోంది.

బీఆర్ఎస్ బహిష్కృత నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ మంగళవారం చర్చలు జరిపింది. కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలను ఆయన వర్గానికి కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. అనూహ్యంగా పాలేరులో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తారని, ఆమెకు అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని పొంగులేటి కోరినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇతర పార్టీ నాయకులకు మద్దతు ఇచ్చే విషయం తమ చేతిలో లేదని.. అదంతా అధిష్టానం చూసుకుంటుందని తేల్చి చెప్పినట్లు సమాచారం.

కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి టికెట్లు కేటాయించే విషయంపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తున్నది. ఆయనే వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై కూడా చర్చ చేస్తారని సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ షర్మిల స్వయంగా డీకే శివకుమార్ వద్దకు వెళ్లి కలిశారు. అక్కడ ఏం చర్చ జరిగిందనే విషయం బయటకు రాకపోయినా.. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉండగా.. కాంగ్రెస్ 223 సీట్లలో మాత్రమే పోటీ చేసింది. మేలుకోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సర్వోదయ కర్ణాటక పార్టీ అభ్యర్థి దర్శన్ పుట్టనయ్యకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ నియోజకవర్గం నుంచి దర్శన్ గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పాలేరులో వైఎస్ షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ షర్మిల వెనుక ఉన్నారు. ఒకానొక దశలో వైఎస్ఆర్టీపీలో పొంగులేటి చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే షర్మిలకు మద్దతు ఇవ్వాలనే షరతు పెట్టారని.. మొదటి నుంచి తాను ప్రోత్సహించిన షర్మిల విజయం కోసమే చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాణంగా మారిపోనున్నారనే చర్చ జరుగుతోంది.

First Published:  14 Jun 2023 9:10 AM IST
Next Story