తెలంగాణ కొత్త డీజీపీ రేసులో ఐదుగురు..! త్వరలో యూపీఎస్సీకి లిస్టు పంపనున్న ప్రభుత్వం
ముగ్గురి పేర్లు రేసులో ముందంజలో ఉన్నా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో పోలీసు వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. నిబంధనల ప్రకారం డీజీ ర్యాంకులో లేదా 30 ఏళ్ల సర్వీసు కలిగిన ఐపీఎస్ అధికారులు డీజీపీ పోస్టుకు అర్హులు. ప్రభుత్వం అర్హత కలిగిన ఐదురురి పేర్లను యూపీఎస్సీకి పంపిస్తే.. కమిషన్ ముగ్గురి పేర్లను సిఫార్సు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేస్తుంది. కాగా, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం కానున్నది.
ప్రస్తుతం డీజీపీ రేసులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా రేసులో ముందున్నట్లు తెలుస్తున్నది. ఏసీబీ డీజీగా పని చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలో రిటైర్ కానున్న ఉమేష్ షరాఫ్ పేరు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికి ఈ ముగ్గురి పేర్లు రేసులో ముందంజలో ఉన్నా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో పోలీసు వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. రాబోయేది ఎన్నికల ఏడాది కాబట్టి సమర్థవంతమైన అధికారిని డీజీపీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.
ముగ్గురు సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ ఉమేష్ షరాఫ్ అందరి కంటే సీనియర్. అయితే ఆయన వచ్చే ఏడాది జూలైలోనే పదవీ విరమణ చేయనున్నారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్న ఆయన పేరును ఈ పోస్టుకు పరిగణించే వీలుండదని తెలుస్తున్నది. ఉమేష్ తర్వాత సీనియర్టీ లిస్టులో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, సీఐడీ డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ ఉన్నారు. వీరిలో గోవింద్ సింగ్ ఈ నెలాఖరుకే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయనకు ఈ పదవి లభించే అవకాశం లేదు.
ఇక 1991 బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మరో ఐపీఎస్ రాజీవ్ రతన్‌లు ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. డీజీపీ కావాలంటే డీజీ హోదా ఉండాలి. గోవింద్ సింగ్ పదవీ విరమణ చేయనుండటంతో వీరిద్దరికీ డీజీ ర్యాంక్ పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరిలో ఒకరికి క్యాడర్ పోస్టు, మరొకరికి ఎక్స్ క్యాడర్ పోస్టు కేటాయిస్తారని తెలుస్తున్నది. నాలుగైదు రోజుల్లో వీరి పదోన్నతి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
యూపీఎస్సీకి ఐదుగురు సీనియర్ల లిస్టు పంపాల్సి ఉన్నది. ప్రభుత్వం ఉమేష్ షరాఫ్, రవి గుప్తా, అంజనీకుమార్, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్‌ల పేర్లు యూపీఎస్సీకి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురి లిస్టు వస్తే అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఒకటి రెండు వారాల్లోనే ఐదుగురి లిస్టును తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. షార్ట్ లిస్ట్ కూడా వెంటనే ప్రభుత్వానికి చేరుతుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ డీజీపీ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారు.