మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?
సీఎం రేవంత్‌రెడ్డి హామీలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు
సికింద్రాబాద్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వే ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బావాబావమరుదులు (కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి) మూసీ ముసుగు కప్పుకుని రాజకీయాలు ఎంతకాలం చేస్తారు? మూసీని అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు గడుపుతారు? మీ భరతం పడతామని విరుచుకుపడ్డారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీటుగా ఎక్స్ వేదికగా బదులిచ్చారు.
మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు అని ప్రశ్నించారు. రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకున్న మోసగాడు ఎవరు? అవ్వ, తాతలకు నెలకు రూ. 4 వేలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? అని ప్రశ్నలు సంధించారు.