తెలంగాణలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు..? ఈటల పంతం నెగ్గేనా..?
రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు అనే విషయాన్ని పక్కన పెడితే ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీకి ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ బీజేపీలో దానికి చాలా కాంపిటీషన్ ఉంది.
ఇప్పటి వరకూ తెలంగాణలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్ ఉన్నారు. ఆయనకు అదనంగా ఇద్దరు ఎమ్మెల్యేలు చేరినా, ఆయన్నే ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. ప్రొటోకాల్ మర్యాదలు ఆయనకే ఇచ్చారు. పార్టీ ఆఫీస్‌లో ప్రత్యేక గది, బీజేపీ కేంద్ర కమిటీ సమావేశాలకు పార్టీ అధ్యక్షుడితో పాటు హాజరయ్యే అవకాశం, అన్నీ ఆయనకే దక్కాయి. ఇప్పుడు ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఒకవేళ ఆయన వివరణతో పార్టీ సంతృప్తి చెంది వెనక్కి తగ్గినా, ఫ్లోర్ లీడర్‌గా మళ్లీ అవకాశం ఇవ్వబోరని అంటున్నారు. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరిలో ఫ్లోర్ లీడర్ అవకాశం ఎవరికి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ ఎవరు..?
అధికార టీఆర్ఎస్‌కి కూడా ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన అనుభవం ఈటల రాజేందర్‌ది. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు బీజేపీలో చేరి జస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి కావాలనే ఆశ ఆయనకు బలంగా ఉంది. అందుకే అనుచరులతో అప్పుడప్పుడు ఈటల సీఎం, ఈటల సీఎం అని నినాదాలు చేయించుకుంటారు. అటు బండి సంజయ్‌తో బలమైన కాంపిటీషన్ ఉన్నా కూడా.. ఈటల ఫ్లోర్ లీడర్ అయితే ఆ హోదా వేరు. అందుకే ఆయన రాజాసింగ్ ఎపిసోడ్ తర్వాత తనకు ఫ్లోర్ లీడర్‌గా అవకాశమివ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు.
రఘునందన్ పరిస్థితి ఏంటి..?
ఇక రఘునందన్ రావు విషయానికొస్తే, దుబ్బాకలో ఆయన టీఆర్ఎస్ సీటుని గెలుచుకుని అప్పట్లో సంచలనం సృష్టించారు. అధికార టీఆర్ఎస్‌కి తొలి షాకిచ్చారు. మంచి వాగ్ధాటికల నాయకుడు. ఆయన గతంలోనే తనకు ఫ్లోర్ లీడర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ చర్చల్లో ఆ మేరకు తనకు ప్రాధాన్యం దక్కుతుందని ఆలోచించారు. కానీ అధిష్టానం దానికి ససేమిరా అంది. రాజాసింగ్‌నే కొనసాగించింది. ఇప్పుడు రాజాసింగ్ లేడు కాబట్టి తనకి అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు రఘునందన్ రావు. పార్టీలో తన సీనియార్టీని చూడాలంటున్నారు.
రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు అనే విషయాన్ని పక్కన పెడితే ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీకి ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ బీజేపీలో దానికి చాలా కాంపిటీషన్ ఉంది. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని నాయకులంతా ఆ పదవి కోసం ట్రై చేస్తున్నారు. మరి అధిష్టానం రాజాసింగ్‌ని పక్కనపెట్టాక, ఆ ప్రాధాన్యం ఈటలకు ఇస్తుందా? రఘునందన్‌కి అప్పగిస్తుందా..? అనేది చూడాలి.