Telugu Global
Telangana

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ముందు వరసలో ఉన్నది ఎవరంటే..

గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి 9 మంది అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ముందు వరసలో ఉన్నది ఎవరంటే..
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు ఈ సారి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు చోట్ల కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థులను నిలపాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున షబ్బీర్ అలీతో పాటు మరో వ్యక్తి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై సునిల్ కనుగోలు టీమ్ క్షేత్ర స్థాయి సర్వే చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక గజ్వేల్ నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఆ రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ తరపున ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. 2014లో గట్టి పోటీ ఇచ్చినా.. 2018లో మాత్రం సీఎం కేసీఆర్ భారీగా మెజార్టీ పెంచుకున్నారు. ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉండటమే కాకుండా.. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ సారి కొత్త అభ్యర్థిని వెతికే పనిలో పడింది.

గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి 9 మంది అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలో 2009లో నర్సారెడ్డి టీడీపీ అభ్యర్థి ఎల్.ప్రతాప్ రెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికలో నర్సారెడ్డి దాదాపు 42 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనకు టికెట్ రాలేదు. ప్రస్తుతం సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి.. గజ్వేల్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఎలాగో కామారెడ్డి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని.. దాన్ని సద్వినియోగం చేసుకొని గజ్వేల్‌లో గెలుస్తానని నర్సారెడ్డి చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం, లోకల్‌లో పరిచయాలు తనకు ఉపయోగపడుతాయని నర్సారెడ్డి అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పుడు మెజార్టీ సభ్యులు నర్పారెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.

అయితే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో సునిల్ కనుగోలు టీమ్ మరోసారి సర్వే చేస్తున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్‌ను ఢీకొట్టగలిగే బలమైన అభ్యర్థి ఎవరనే విషయాన్ని సునిల్ టీమ్ ఇచ్చే రిపోర్ట్‌ను బట్టే తేలుస్తారని సమాచారం. అంతే కాకుండా గజ్వేల్, కామారెడ్డికి మధ్య కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండింటిలో ఒక చోట అయినా ఓడించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఆ మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.

First Published:  10 Sept 2023 10:47 AM IST
Next Story