Telugu Global
Telangana

గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..?

గోషామహల్‌ నుంచి బీఆర్ఎస్ టికెట్‌ కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో నంద కిషోర్‌ బిలాల్‌ అలియాస్ నందు బిలాల్‌, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్ రాథోడ్‌, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిశ్‌ కుమార్ యాదవ్‌ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు.

గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..?
X

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడంతో పాటు.. అతన్ని గోషామహల్ అభ్యర్థిగా ఫస్ట్‌ లిస్ట్‌లోనే ప్రకటించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బీఆర్ఎస్ వైపు మళ్లింది. ఇప్పటివరకూ గోషామహల్ అభ్యర్థిని బీఆర్ఎస్ ఫైనల్ చేయలేదు.

గోషామహల్‌ నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు రాజాసింగ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి రాజాసింగ్. అయితే తర్వాత అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగింది. దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ రావు, హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ బీజేపీ టికెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

గోషామహల్ హైద‌రాబాద్ సిటీలోనే ఉండటంతో ఇది బీఆర్ఎస్‌కు కీలకమైన స్థానం. సిటీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇక బీజేపీని ఓడించాలన్న ప్లాన్‌లో భాగంగా బీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న MIM గోషామహల్‌లో అభ్యర్థిని నిలబెట్టలేదు.

గోషామహల్‌ నుంచి బీఆర్ఎస్ టికెట్‌ కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో నంద కిషోర్‌ బిలాల్‌ అలియాస్ నందు బిలాల్‌, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్ రాథోడ్‌, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిశ్‌ కుమార్ యాదవ్‌ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నలుగురిలో నందకిషోర్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నంద కిషోర్‌ ప్రస్తుతం గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. ఇక సీనియర్ లీడర్ ప్రేమ్‌ సింగ్ రాథోడ్‌ 2018లో బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి.. 44 వేల 120 ఓట్లు సాధించారు. రాజాసింగ్‌కు 61 వేల 806 ఓట్లు వచ్చాయి.

సీఎం కేసీఆర్ మొదటి జాబితాలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తర్వాత జనగాం అభ్యర్థిగా పల్లాను ఫైనల్ చేశారు. అయితే ప్రస్తుతం నర్సాపూర్‌, అలంపూర్‌, గోషామహల్‌ అభ్యర్థిత్వాలపై సస్పెన్స్ కొనసాగతుతోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఉండటంతో ఆ టైంలో అభ్యర్థిని ప్రకటించలేదు బీఆర్ఎస్. ఇప్పుడు రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో గోషామహల్‌ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

First Published:  23 Oct 2023 12:57 PM IST
Next Story