Telugu Global
Telangana

ఖానాపూర్‌లో అనూహ్యంగా తెరపైకి.. ఎవరీ భూక్యా జాన్సన్‌..?

ప్రస్తుత జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్‌ తండాకు చెందిన భూక్యా శామ్యూల్‌ నాయక్‌, కేస్లీబాయి దంపతుల కుమారుడు భూక్యా జాన్సన్ నాయక్‌.

ఖానాపూర్‌లో అనూహ్యంగా తెరపైకి.. ఎవరీ భూక్యా జాన్సన్‌..?
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సోమవారం 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరిగింది. సీఎం కేసీఆర్‌ పోటీ చేసే కామారెడ్డిని మినహాయిస్తే కేవలం ఆరుగురు సిట్టింగ్‌లను మాత్రమే మార్చినట్లు. ఆరుగురిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ముగ్గురు సిట్టింగ్‌లను మార్చడం చర్చనీయాంశమైంది. నాలుగు నెలల క్రితమే పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలును ప్రస్తావిస్తూ బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్‌. అయినా తీరులో మార్పు లేకపోవడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖానాపూర్‌లో రేఖా నాయక్ స్థానంలో అనూహ్యంగా భూక్యా జాన్సన్ నాయక్‌కు టికెట్‌ కన్ఫామ్ చేశారు గులాబీ బాస్‌. ఈ నేపథ్యంలో అసలు భూక్యా జాన్సన్ నాయక్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుత జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్‌ తండాకు చెందిన భూక్యా శామ్యూల్‌ నాయక్‌, కేస్లీబాయి దంపతుల కుమారుడు భూక్యా జాన్సన్ నాయక్‌. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. నిజాం కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చదివి, ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లమా చేశారు. మొదట్లో ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీలోఉద్యోగం చేసి.. తరువాత అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నెలకొల్పారు. కొంత కాలం అక్కడే స్థిరపడ్డారు. అయితే నిజాం కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్‌, జాన్సన్ నాయక్‌ ఇద్దరూ క్లాస్‌మెట్స్‌ కావడంతో వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. కేటీఆర్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో ప్ర‌జాసేవ చేయ‌డానికి ఆస‌క్తి పెంచుకున్నారు జాన్సన్‌ నాయక్‌. పార్టీ అధిష్టానం ఖానాపూర్‌ టికెట్‌ కన్ఫామ్‌ చేయడంతో ఫస్ట్‌ టైం ప్రత్యక్ష రాజకీయాలలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు జాన్సన్‌ నాయక్‌.

గత ఆరు నెలల నుంచి ఖానాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేసిన జాన్సన్ నాయక్‌ పార్టీ కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తూ వచ్చారు. క్యాడర్‌కు టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ సభకు సైతం రేఖా నాయక్‌కు పోటీగా జనసమీకరణ చేసి తరలించారు జాన్సన్.

ఇక బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌.. టికెట్లు ప్రకటించిన కాసేపటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేఖా నాయక్‌ సైతం ఇవాళో, రేపో కాంగ్రెస్‌ గూటికి వెళ్తారని సమాచారం. ఖానాపూర్‌ నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

*

First Published:  22 Aug 2023 4:31 PM IST
Next Story