ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? కేసీఆర్ వ్యాఖ్యలతో ఏపీలో పొలిటికల్ హీట్
కేసీఆర్ తో మాట్లాడిన, లేదా మంతనాలు జరపాలనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు..? ఏ పార్టీ వారు..? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ లో ఏపీ నుంచి చేరికలు మొదలయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియామకం కూడా పూర్తయింది. సంక్రాంతి తర్వాత మరిన్ని చేరికలుంటాయని స్వయానా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం ఇక్కడ విశేషం. అంతే కాదు, సిట్టింగ్ లు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, ఏపీలో ఎమ్మెల్యేలు సహా మహా మహులు బీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ బాంబు పేల్చారు కేసీఆర్. కేసీఆర్ ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అందరికీ తెలుసు. కచ్చితమైన సమాచారం ఉంటేనే, ఇప్పటికే మంతనాలు జరిగి ఉంటేనే ఎమ్మెల్యేల విషయంపై కేసీఆర్ హింట్ ఇచ్చి ఉంటారు.
ఎవరా ఎమ్మెల్యేలు..?
ఇంతకీ కేసీఆర్ తో మాట్లాడిన, లేదా మంతనాలు జరపాలనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు..? ఏ పార్టీ వారు..? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ఎంట్రీతో వైసీపీలో కలవరం మొదలైంది. బీఆర్ఎస్ విషయంలో టీడీపీ ఇంకా స్పందించలేదు, కీలక నేతను తీసుకెళ్లినా జనసేన సైలెంట్ గానే ఉంది, బద్ధ శత్రువైన బీజేపీ కూడా ఇంకా కామెంట్ చేయలేదు. ఈలోగా వైసీపీ ఉలిక్కిపడింది. మాజీ మంత్రులు బీఆర్ఎస్ చేరికలపై కామెంట్ చేసేందుకు క్యూ కట్టారు. అసలా పార్టీపై ఏపీ ప్రజలకు కోపం పోలేదంటున్నారు. వైసీపీకి ఇంత ఉలికిపాటెందుకో ముందు ముందు తేలిపోతుంది.
సంక్రాంతి తర్వాత ఎవరెవరు..?
సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు పెద్దఎత్తున సాగుతాయన్నారు కేసీఆర్. దేశంలోని 6 లక్షలకు పైగా గ్రామాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల్లో సమాంతరంగా నడుస్తామన్నారు. స్వాతంత్ర సమరయోధులకు దక్కినంత గౌరవం బీఆర్ఎస్ నేతలకు దక్కుతుందని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని నాయకులకు సూచించారు. ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని, సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం తన కార్యాలయం కంటే రద్దీగా మారుతుందని తెలిపారు కేసీఆర్.
బీఆర్ఎస్ లో చేరితే లాభమేంటి..?
ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం పక్కనపెడితే, ఈ ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. ఏపీ బీఆర్ఎస్ నేతలంటే కచ్చితంగా తెలంగాణలో కూడా వారికి ప్రయారిటీ ఉంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దొరికినట్టవుతుంది. అందులోనూ కేంద్రంలో బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్న పార్టీగా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంటోంది. ఏపీలో మోదీ విధానాలను వ్యతిరేకించేవారందరికీ బీఆర్ఎస్ మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఆ పార్టీవైపు నేతలు ఆకర్షితులవుతున్నారు. సంక్రాంతి తర్వాత చేరికలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.