మునుగోడులో మునిగేదెవరు..? తేలేదెవరు..?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి.. సంక్షేమ పథకాలను ముఖ్యంగా మునుగోడు ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యను సమూలంగా నిర్మూలించడానికి కేసీఆర్ చేసిన కృషిని మరొక్కసారి ప్రజలకు తెలియచేసి ఓట్లు అభ్యర్థించడం
అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరింది. పోలింగ్ కి ఇంకా పది రోజులు కూడా లేకపోవడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గెలుపు మాదే అని అందరూ ధీమాగా ఉన్నారు. ప్రచార శైలిని, ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను, గ్రౌండ్‌లోకి వెళ్లిన ఇండిపెండెంట్ జర్నలిస్టుల అభిప్రాయాలను జాగ్రత్తగా గమనిస్తే మునుగోడు ఉపఎన్నికలో ప్రజామోదం ఎవరికి దక్కనుందో అర్థం అవుతుంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే.. నియోజకవర్గంలో బీజేపీకి అసలు పట్టు లేకపోయినప్పటికీ కేవలం తన వ్యక్తిగత బలం మీదనే గెలుస్తానని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రాజగోపాల్ రెడ్డి విజయావకాశాలు రోజురోజుకీ సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తనకు వచ్చిన మాట నిజమే అని ఆయన స్వయంగా ఒప్పుకోవడం అన్నది ప్రత్యర్థులకు తిరుగులేని ఆయుధంగా మారింది. రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చింది అన్న విషయం నియోజక వర్గంలో ప్రతీ అంచుకూ తీసుకెళ్లడంలో ఆయన ప్రత్యర్థులు విజయం సాధించారు.
దీనికి తోడు, నమ్మి గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేశాడనే ఆగ్రహంతో రగిలిపోతున్నారు మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. తనతో పాటే పెద్ద సంఖ్యలో బీజేపి లోకి వస్తారనుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రాకపోవడమే కాకుండా, ప్రచారానికి తాను వెళ్ళే ప్రతీ ఊర్లో భారీఎత్తున నిరసనలు తెలపడం, ప్రచారాన్ని అడ్డుకోవడం రాజగోపాల్ రెడ్డికి చాలా నెగటివ్ అయ్యింది. గ్రామాల్లో బీజేపి క్యాడర్ లేకపోవడం.. తెలంగాణ బీజేపి నాయకుల సహకారం అంతంత మాత్రంగానే ఉండటంతో రాజగోపాల్ రెడ్డి చాలా అసహనానికి లోనవుతున్నారు, అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారని టాక్. అస్వస్థత అనేది రాజకీయ డ్రామా అని రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థుల విమర్శ అన్నది వేరే విషయం. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ వీడి బీజేపిలో చేరడం రాజగోపాల్ రెడ్డి కి ప్లస్ అవుతుంది అనుకునేలోపే, బూడిద భిక్షమయ్య గౌడ్, స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి నేతలు బీజేపికి గుడ్ బై చెప్పి కారెక్కడం ఆ పార్టీకి ఊహించని దెబ్బే అని చెప్పొచ్చు.
ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ విషయానికి వస్తే.. టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పార్టీ అభ్యర్థి ఎవరు అని మొదట్లో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, సర్వేలు చేయించి, లోకల్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యుడైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు అధినేత కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి.. సంక్షేమ పథకాలను ముఖ్యంగా మునుగోడు ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యను సమూలంగా నిర్మూలించడానికి కేసీఆర్ చేసిన కృషిని మరొక్కసారి ప్రజలకు తెలియచేసి ఓట్లు అభ్యర్థించడం మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీకి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వ్యవహారం తిరుగులేని ఆయుధంగా దొరికింది. TV 9 live లో రాజగోపాల్ రెడ్డి తనకు 18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్న మరుక్షణం నుండి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు విజయం సాధించారని చెప్పవచ్చు. ఈ వేల కోట్ల వ్యవహారం బయటికి రావడంతో మొత్తం మునుగోడు ఎలక్షన్ తీరు మారింది అంటే అతిశయోక్తి కాదు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మునుగోడుకు ఒరిగేదేమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది అని టీఆర్ఎస్ శ్రేణులు ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలను కలిసి ఓట్లు అడుగుతున్న పద్ధతి, అగ్ర నాయకులతో రోడ్ షోలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆన్‌లైన్ లో, గ్రౌండ్ మీద జరుగుతున్న క్యాంపైయినింగ్ ను గమనిస్తే ప్రచారంలో TRS పార్టీ ముందుంది అని చెప్పక తప్పదు.
తమ సిట్టింగ్ సీటు అయిన మునుగోడు లో గెలిచి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి అన్న లక్ష్యంతో మునుగోడు బరిలోకి దిగిన కాంగ్రెస్ పరిస్థితి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి వెనకే పార్టీ క్యాడర్ అంతా పోకపోవడం మంచిదే అయినప్పటికీ, దాన్ని బలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలం అయినట్టే కనిపిస్తుంది. స్టార్ క్యాంపైనర్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాల్సిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా, కాంగ్రెస్ గెలవదు అని, తాను ప్రచారం చేసినా లాభం లేదు అని, సోదరుడికే ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరడం కాంగ్రెస్ శ్రేణులను పూర్తిగా నిరుత్సాహపరిచే విషయం. కాంగ్రెస్ పార్టీ క్యాడర్, ఆడబిడ్డ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న.
84 శాతం ఓట్లు నాకే అంటున్న ప్రజాశాంతి పార్టీ కే.ఏ. పాల్, మునుగోడు మాదే అంటున్న బీఎస్పీల ప్రభావం అంతంత మాత్రమే. కేవలం తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే ఆ పార్టీలు బరిలో ఉన్నాయి అన్న సంగతి వాటికి కూడా తెలుసు.
మొత్తానికి మహారంజుగా సాగుతున్న మునుగోడు పోరులో గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే ఆరవ తారీఖు వరకు ఆగాల్సిందే.