Telugu Global
Telangana

పసుపు బోర్డు ఏర్పాటు ఎక్కడ.. నోటిఫికేషన్‌లో కనిపించని తెలంగాణ!

అక్టోబర్ 1న పాలమూరు జిల్లాలో పర్యటించిన ప్రధాని..రాష్ట్రానికి జాతీయ పసుపుబోర్డుతో పాటు, కేంద్రీయ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పసుపు బోర్డు ఏర్పాటు ఎక్కడ.. నోటిఫికేషన్‌లో కనిపించని తెలంగాణ!
X

పసుపు బోర్డు విషయంలో కేంద్రం దాగుడుమూతలు ఆడుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. గురువారం నేషనల్‌ టర్మరిక్‌ బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బోర్డు నిర్వహణ, పర్యవేక్షణ పూర్తిగా కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. అయితే నోటిఫికేషన్‌లో మెయిన్ ఆఫీసు ఎక్కడ ఉంటుంది.! ప్రాంతీయ కార్యాలయాలుంటాయా.. అనేది వివరాలు మాత్రం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. నోటిఫికేషన్‌లో తెలంగాణ అనే పదం ఎక్కడా లేదు. హైదరాబాద్‌లో జాతీయ ఔషద విద్య, పరిశోధన మండలి-నైపర్‌ శాఖ ఉన్నప్పటికీ.. దానికి బదులు గువాహటిలో నైపర్‌ డైరెక్టర్‌ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు.

ప్రపంచంలో అతిపెద్ద పసుపు సాగుదారు, వినియోగదారు, ఎగుమతిదారు భారతే. కరోనా సమయంలో దేశీయంగా, అంతర్జాతీయంగా పసుపునకు డిమాండ్ పెరిగింది. ఇక ఇప్పుడు కొత్తగా ఫార్మాస్యూటికల్స్, న్యూట్రాస్యూటికల్స్‌, కాస్మాస్యూటికల్స్‌లో పసుపును ఉపయోగిస్తుండటం వల్ల ఈ పంటకు ప్రాధాన్యం మరింత పెరిగింది. పసుపు ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు అన్ని స్థాయిల్లో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో అత్యధికంగా పసుపు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించిన కేంద్రం..ఈ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు, రైతులను నియమించనుంది.

అక్టోబర్ 1న పాలమూరు జిల్లాలో పర్యటించిన ప్రధాని..రాష్ట్రానికి జాతీయ పసుపుబోర్డుతో పాటు, కేంద్రీయ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తర తెలంగాణలోని పసుపు రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ గెలిచిన 5 రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే గెలిచిన తర్వాత మాట దాటవేసిన అర్వింద్.. బోర్డుల వ్యవస్థ ఖతమైందని, దానికంటే మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేశామంటూ ప్రజలను మభ్యపెట్టారు. మళ్లీ ఎన్నికలు సమీపించడంతో పసుపుబోర్డు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 1న మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోడీ.. పసుపుబోర్డుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్‌లో బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది పేర్కొనకపోవడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  6 Oct 2023 2:29 AM GMT
Next Story