కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ ఇప్పట్లో తేలేనా?
నలువైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోవడంతో స్క్రీనింగ్ కమిటీ టికెట్ల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం.
ఇదిగో తొలి జాబితా.. అదిగో ఫస్ట్ లిస్ట్ అంటూ లీకులు ఇస్తూ ఊరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అసలు జాబితాను విడుదల చేస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇతర పార్టీల్లో టికెట్లు రాక భంగపడిన నాయకులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌లో చేరుతుండటం.. మరోవైపు బీసీ నాయకులు ఎక్కువ టికెట్ల కోసం డిమాండ్ చేస్తుండటంతో టికెట్ల పంచాయితీ ఒక కొలిక్కి రావడం లేదు. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం అయ్యింది. అయినా సరే టికెట్లపై ఎటూ తేల్చలేకపోయింది.
తాజాగా పార్టీలో చేరి మైనంపల్లి హన్మంతరావు, కుమారుడు రోహిత్, నకిరేకర్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు టికెట్లు ఇచ్చే విషయంలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్‌లో చేసిన డిక్లరేషన్ వీరికి వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఒక కుటుంబంలో ఒకే టికెట్ ఇవ్వాలని.. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వకూడదని అప్పట్లో డిక్లరేషన్ చేశారు. ఇప్పుడు అధిష్టానం ఎలా కొత్త వాళ్లకు టికెట్లు ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు.
మైనంపల్లి కుటుంబం విషయంలో మొదలైన ముసలాన్ని సద్దుమణిగేలా చేయడానికి ఇప్పటికే అధిష్టానం మెదక్ జిల్లాలో కీలకమైన నాయకులను ఢిల్లీకి పిలిపించింది. ఇక వేముల వీరేశం విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. తాను వ్యతిరేకించినా పార్టీలో చేర్చుకోవడం, టికెట్ హామీ ఇవ్వడంపై కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తనను తిట్టి పార్టీలో నుంచి వెళ్లిపోయిన డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌ను తిరిగి పార్టీలో చేర్చుకొని.. భువనగిరి టికెట్ ఇస్తామని చెప్పడంపై కూడా కోమటిరెడ్డి మండిపడుతున్నట్లు తెలుస్తున్నది.
పాలమూరు జిల్లాలో కూడా జూపల్లి కృష్ణారావు సూచించిన పలువురికి టికెట్లు కేటాయిస్తామనే హామీ ఇవ్వడాన్ని ఇతర నాయకులు జీర్ణించుకోవడం లేదు. ఇప్పటికే వీటికి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందాయని సమాచారం. మరోవైపు బీసీ నాయకులందరూ రెండు దఫాలుగా సమావేశమై టికెట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. పలువురు బీసీ నాయకులు ఢిల్లీలోనే ఉండి టికెట్ల లాబీయింగ్ చేస్తున్నారు. నలువైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోవడంతో స్క్రీనింగ్ కమిటీ టికెట్ల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం.
శనివారం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మరో సారి సమావేశం కానున్నది. కాగా ఈ కమిటీలో సురేశ్ శెట్కర్, షబ్బీర్ అలీలకు చోటు కల్పించాలని పలువును నాయకులు అధిష్టానాన్ని కోరారు. వచ్చే వారం కూడా మరో సారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే రెండు వారాల దాకా తెలంగాణ అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తున్నది.