Telugu Global
Telangana

కాలంబు రాగానే కాటేసి తీరాలని...

11 నెలల పాలనలో సంక్షేమం మాయమైందని, అభివృద్ధి దూరమైందని, కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుందంటూ ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ఎద్దేవా

కాలంబు రాగానే కాటేసి తీరాలని...
X

'పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట' అంటూ రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారని విమర్శించారు. కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని,వందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని ధ్వజమెత్తారు. పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైందని, అభివృద్ధి దూరమైందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుందన్నారు. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తున్నదని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

First Published:  15 Nov 2024 10:18 AM IST
Next Story