Telugu Global
Telangana

సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు అడ్డుకున్న మోడీ ప్రభుత్వం.. ఇదే సాక్ష్యం

సింగరేణి గురించి ప్రధాని చెప్పినవన్నీ అబద్దాలే అని తెలుస్తున్నది. మెజార్టీ వాటాదారు రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా.. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకుండా కేంద్రమే అడ్డుకుంటోంది.

సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు అడ్డుకున్న మోడీ ప్రభుత్వం.. ఇదే సాక్ష్యం
X

తెలంగాణ పర్యటనలో భాగంగా రామగుండం వచ్చిన ప్రధాని మోడీ సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నామన్నది పచ్చి అబద్దం అని వ్యాఖ్యానించారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం మాత్రమే వాటా ఉన్నదని.. మిగిలిన 51 శాతం తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇందులో మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిది. ఇక కేంద్రం ఎలా విక్రయిస్తుందని మోడీ ప్రశ్నించారు. ఇవ్వాళ సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్న హైదరాబాద్ పెద్దలకు నిద్రపట్టదని ఎద్దేవా చేశారు.

అయితే, సింగరేణి గురించి ప్రధాని చెప్పినవన్నీ అబద్దాలే అని తెలుస్తున్నది. మెజార్టీ వాటాదారు రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా.. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకుండా కేంద్రమే అడ్డుకుంటోంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్‌కు 4జీ, 5జీ లైసెన్సులు ఇవ్వకుండా ఎలా ఆలస్యం చేస్తోందో.. అదే మాదిరిగా సింగరేణి కొత్త బ్లాకుల్లో బొగ్గు తవ్వకుండా అడ్డుకునేది కేంద్రమే అని స్పష్టమవుతోంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం విషయంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో ప్రశ్నించారు. దీనికి కేంద్ర బొగ్గు శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి గతేడాది డిసెంబర్‌లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

సింగరేణి ప్రభుత్వరంగ సంస్థే అయినా.. దానికి ప్రత్యేకంగా బొగ్గు బ్లాకులు కేటాయించలేమని చెప్పారు. సింగరేణి కూడా వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సాధారణంగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు గనులను కేటాయించాలని కోరితే కేంద్రం తప్పకుండా పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలు కోరగానే వేలం నుంచి బొగ్గు బ్లాకులను తొలగించింది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా సింగరేణి బొగ్గు బ్లాకుల విషయంలో ప్రధాని మోడీకి లేఖ రాసినా అటు వైపు నుంచి స్పందన లేదు.

తెలంగాణలోని కల్యాణి ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాకులను సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే, కేంద్రం మాత్రం ఈ రిక్వెస్టును పక్కన పెట్టి వేలానికి సిద్ధపడింది. అదే సమయంలో ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు ఒక బ్లాక్ వేలాన్ని పక్కన పడేసింది. కోల్ ఇండియాకు ఇప్పటి వరకు 118 బొగ్గు బ్లాకులు కేటాయించింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి.. తానకు తానుగా బ్లాకులు కేటాయించేసుకున్నది. ఇక గుజరాత్‌లోని ఒక బ్లాకును జీఎండీసీకి కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరగానే లిగ్నైట్ బ్లాక్‌ను అప్పగించేసింది.

జీఎండీసీ, ఓఎంసీ, సింగరేణి.. అన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలే. ప్రతీ కంపెనీలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నది. కానీ, సింగరేణిపై మాత్రం మోడీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపిస్తోంది. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం సింగరేణి పట్ల ఎంత వివక్ష చూపిస్తోందో వెల్లడైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి కార్మికులు కూడా అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సమ్మె కూడా చేశారు. అయినా సరే కేంద్రం దిగిరాలేదు.

మోడీ ప్రభుత్వం నిరాకరించిన నాలుగు బొగ్గు బ్లాకుల సర్వేను స్వయంగా సింగరేణి సంస్థే చేపట్టింది. దేశంలో బొగ్గు నిల్వల పరిశోధనలు, గనుల సర్వే, డ్రిల్లింగ్ సామర్థ్యం కేవలం నాలుగు సంస్థలకే ఉన్నది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), కోల్‌మైన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంపీడీఐ), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్)తో పాటు సింగరేణికి మాత్రమే ఈ అర్హత ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గోదావరిలోయ పరిధిలో ఉన్న పలు బ్లాకులపై సింగరేణి సంస్థ సర్వే చేసింది. కానీ, సర్వే చేసిన సంస్థకే బ్లాకులు కేటాయించకుండా.. వేలానికి పెట్టి ఇబ్బంది పెట్టింది.

సింగరేణి సంస్థను ఆర్థికంగా దెబ్బతీయాలనే బ్లాకుల కేటాయింపు విషయంలో కేంద్రం వేలం పాటను తెరపైకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఇతర రాష్ట్రాలకు లేని వేలం పాటను.. కేవలం తెలంగాణ రాష్ట్ర పరిధిలో నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా రామగుండంలో సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం లేదని మోడీ చెప్పారు. కానీ, ఆ సంస్థను దివాలా తీయించడానికి మాత్రం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఆనాడు ప్రహ్లాద్ జోషి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎన్ నాయకులు క్రిషాంక్ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.



First Published:  12 Nov 2022 2:33 PM GMT
Next Story