పండుగపూట ఇదేం వికృతానందం?
హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యవకులు ఇష్టం వచ్చినట్లు బాణసంచా కాలుస్తూ బైక్‌లపై చేసిన విన్యాసాలపై సజ్జనార్ ఆగ్రహం
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యవకులు ఇష్టం వచ్చినట్లు బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మండిపడ్డారు. పండుగపూట ఇదేం వికృతానందమని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు.
'దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.