టీడీపీ బిడ్డను.. కాంగ్రెస్‌కు కోడలి లాంటి వాడినన్న రేవంత్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏమిటి?
టీడీపీ ఓటు బ్యాంకును టీఆర్ఎస్ హైజాక్ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే రేవంత్ వ్యాఖ్యలు చేశారు. అంతే కానీ అవి నోరి జారి చేసినవి కావని తెలుస్తోంది.
ఓ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. పార్టీ వాయిస్‌గా ఉండే వ్యక్తి నోరు జారితే అనేక విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావొచ్చు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి శుక్రవారం మునుగోడులో 'తాను టీడీపీ బిడ్డను.. కాంగ్రెస్‌కు కోడలిలాంటోడిని' అని చేసిన వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. సోషల్ మీడియాలోనే కాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వ్యక్తే కావొచ్చు. కానీ ఇప్పటికీ తాను టీడీపీ బిడ్డనే అని చెప్పుకోవడం పార్టీలోని కొంత మందికి రుచించడం లేదు. చంద్రబాబే నన్ను పంపించారని కూడా రేవంత్ చెప్పుకున్నారు. ఈ విషయాలపైనే కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో రేవంత్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకించారు. రేవంత్ చంద్రబాబు కోవర్టని, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారని బహిరంగంగానే గళం విప్పారు. ఇప్పడు అదే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా ఉపఎన్నిక వచ్చిన మునుగోడుకు వెళ్లి రేవంత్ ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
గ్రామగ్రామాన మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమయంలో.. బహిరంగంగా ఏ వ్యాఖ్యలు చేసినా క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుందని రేవంత్‌కు తెలుసు. కానీ, కావాలనే టీడీపీ మాట ఎత్తారని పార్టీలో కొంత మంది అంటున్నారు. ఆ వ్యాఖ్యలు కేవలం మునుగోడు ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని చేసినవి కావని.. భవిష్యత్ లక్ష్యాన్ని నేరవేర్చుకోవడానికి చేసినవే అని చెబుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి తొలుత ఏబీవీపీ నాయకుడిగా ఉన్నాడు. తన రాజకీయ జీవితం బీజేపీ నుంచి మొదలైంది. కానీ తాను మాత్రం టీడీపీ బిడ్డనని చెప్పుకున్నారు. తనపై బీజేపీ ముద్ర పడకూడదు అనేది మొదటి కారణమైతే.. తెలంగాణలో ఉన్న టీడీపీ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పాలనేది రెండో కారణమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్-టీడీపీ సహా వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ ఇప్పుడు వామపక్షాలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొంత బలం తగ్గిపోయినట్లు అయ్యింది.
కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు దూరం కావడంతో మిగిలిన టీడీపీ ఓట్లను అయినా తమవైపు తిప్పుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలిచిన చరిత్ర ఉంది. నల్గొండ, తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, చలకుర్తి (ఇప్పుడు నాగార్జునసాగర్) నియోజకవర్గాల్లో టీడీపీ విజయాలు సాధించింది. మాధవరెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్ నాయకులు టీడీపీ తరపున గెలిచారు. అప్పట్లో ఎన్టీ రామారావు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగు దేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా, తెలంగాణలో కూడా ప్రాభవాన్ని కోల్పోయింది. కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితం అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా వారి ఓటు బ్యాంకు మాత్రం ఉందని రేవంత్ అంచనా వేసుకున్నారు. కమ్యూనిస్టులు వదిలేయడంతో.. ఆ ఓట్లను టీడీపీ ఓటు బ్యాంకుతో పూడ్చుకోవాలన్నదే రేవంత్ రెడ్డి వ్యూహమనే చర్చ జరుగుతుతోంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీగానే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేస్తోంది. బీజేపీది హడావిడి తప్ప.. పెద్దగా ఓటు బ్యాంకు లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహాకూటమి ద్వారా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ నష్టపోయిన విషయం పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఈ సారి టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉండదనే తెలుస్తోంది. కానీ, టీడీపీ ఓటు బ్యాంకును టీఆర్ఎస్ హైజాక్ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే రేవంత్ వ్యాఖ్యలు చేశారు. అంతే కానీ అవి నోరి జారి చేసినవి కావని తెలుస్తోంది. ఇప్పటికీ టీడీపీకి అభిమానులుగా ఉన్న ఓటర్లు, యువతలో రేవంత్ రెడ్డి పట్ల క్రేజ్ ఉంది. దూకుడైన నాయకుడు అనే ముద్ర ఉంది. ఓ వైపు బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏపీ ఏన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం టీడీపీ-బీజేపీ పొత్తు ఉండబోదు. ఎలాగో ఏపీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయి.ఈ అంశాలన్ని బేరీజు వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీ అభిమానుల ఓట్లు సంపాదించడానికి అలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మునుగోడులో గెలుపునకు ఈ వ్యాఖ్యలు ఉపయోగపడక పోయినా.. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేశారంటున్నారు. మరి రేవంత్ వ్యూహం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.