ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పరిస్థితేంటి? మధు యాష్కి బదులు వేరే అభ్యర్థిని దింపుతారా?
ఎల్బీనగర్ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న సుధీర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా మారింది.
జీహెచ్ఎంసీలో కీలకమైన నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ ఒకటి. ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలు, ఏపీ నుంచి వలస వచ్చి సెటిలైన ఓటర్లు ఎక్కువ. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి టీడీపీ గెలిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ గెలవడం గమనార్హం. అయితే బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య టీడీపీ తరపున పోటీ చేయడం వల్లే గెలిచారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక 2009, 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చారు.
ఎల్బీనగర్ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న సుధీర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా మారింది. కొంత మంది కీలక నాయకులు, కార్పొరేటర్లు సుధీర్ రెడ్డి వెంట బీఆర్ఎస్‌లో చేరగా.. మరి కొంత మంది కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. పార్టీలకు అతీతంగా సుధీర్ రెడ్డికి క్షేత్రస్థాయిలో మంచి పేరు, అభిమానులు ఉన్నారు. ప్రతీ డివిజన్, కాలనీల్లో సుధీర్ రెడ్డికి అనుచరులు ఉన్నారు. దీంతో ఆయన ఈ సారి తప్పకుండా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి.
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బలాబలాలు ఏమిటో కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తిగా తెలుసు. అందుకే అతడిని ఎదుర్కునే సమర్థుడైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఎల్బీనగర్ టికెట్ కోసం నిజామాబాద్‌కు చెందిన మధు యాష్కి దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమైన రోజే గాంధీభవన్ గోడలపై మధు యాష్కికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సుధీర్ రెడ్డే ఈ పోస్టర్లు వేయించాడని మధు యాష్కి ఆరోపించగా.. సుధీర్ రెడ్డి వాటిని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాకుండానే అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వార్ మొదలైపోయింది.
అయితే నాన్ లోకల్ అయిన మధు యాష్కికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంత మేరకు సహకరిస్తారనేది అనుమానమే. మధు యాష్కి అంతగా చరిష్మా ఉన్న, స్థానికంగా పరిచయం ఉన్న నాయకుడు కూడా కాదు. అతడికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమని ఇప్పటికే కొంత మంది రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. ఆర్థికంగా బలంగా ఉండి, స్థానికంగా పరిచయం ఉన్న నాయకులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఎల్బీనగర్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే తమ్ముడి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానం వద్ద లాబీయింగ్ కూడా చేశారని.. రాజగోపాల్ రెడ్డికి టికెట్ కూడా కన్ఫార్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎల్బీనగర్‌లో నల్గొండ జిల్లాకు చెందిన సెటిలర్ల ఓటర్లు భారీగా ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా రాజగోపాల్ రెడ్డి సౌండ్ పార్టీనే. కాబట్టి సుధీర్ రెడ్డిని ఎదుర్కోవడానికి రాజగోపాల్ రెడ్డే కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సుధీర్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లిన దగ్గర నుంచి ఎల్బీనగర్ కాంగ్రెస్‌కు జక్కిడి ప్రభాకర్ రెడ్డే పెద్ద దిక్కుగా మారారు. తనకు ఈ సారి తప్పకుండా టికెట్ వస్తుందని చాలా ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోస్టర్లు అతికించి ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ తరపున గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్‌కు ఈ సారి టికెట్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డికే టికెట్ రావడంతో ఆయన నిరాశ చెందారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పంతం పట్టిన రామ్మోహన్ గౌడ్‌కు అసలు టికెట్టే రాకపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా.. అవన్నీ అబద్దాలే అని ఆయన కొట్టిపారేశారు. కానీ ఎన్నికల షెడ్యల్ లోపు ఏమైనా జరగవచ్చని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.
ఎల్బీనగర్‌లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏనాడూ గెలవలేదు. ఈ సారి దేవిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో తప్పకుండా బోణీ కొడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బలమైన సుధీర్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. మధు యాష్కి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ముగ్గురిలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.