కాంగ్రెస్సూ కాదంటే.. కమ్యూనిస్టుల పరిస్థితేంటి..?
కమ్యూనిస్టు నేతలు ఒకప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలనే దేబిరించి, రెండు మూడు సీట్లు గెలుచుకుని సంపద పోగేసుకోవడం ప్రారంభించారు. ప్రజాఉద్యమాల ఊసే మరిచిపోయి పేపర్ టైగర్లుగా మిగిలిపోయారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత అంతటి అనుభవం ఉన్న పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు. నాయకుల స్వార్థంతో అవి ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరాయి. కమ్యూనిస్టులంటే ఒకప్పుడు కులానికి, మతానికి వ్యతిరేకం, పేదోడి పక్షం. ఇప్పుడా సిద్ధాంతాలన్నీ మారిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోగానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోగానీ ఒకరిద్దరు తప్ప కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులందరూ కుల తత్వాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. బూర్జువా పార్టీలని తాము తిట్టిన పార్టీలతోనే రాసుకుపూసుకు తిరిగి, వాళ్లిచ్చే రెండో, మూడో సీట్ల కోసం పార్టీని బలిపెట్టేశారు. తాము మాత్రం చట్టసభల్లోకి వెళ్లి అధికారం అండతో సంపాదించుకోవాలనే ఫక్తు వ్యాపార ధోరణిలోకి మారిపోయారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడం, సమస్యలు వచ్చినప్పుడు ప్రజా ఉద్యమాలను నిర్మించడాన్ని పూర్తిగా విస్మరించాయి. ఇవన్నీ తెలుగు రాష్రాల్లో కమ్యూనిస్టు పార్టీలను జనానికి దూరం చేశాయి. ఫలితంగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం కరవై ఆ పార్టీలు జనం మనస్సుల్లోంచి కూడా కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా టీడీపీ బలంగా ముందుకొచ్చి అధికారం చేపట్టడంతో రాష్ట్ర రాజకీయాలు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయి. కమ్యూనిస్టుల ప్రాబల్యం నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది. ఇదే సమయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో కీలక నేతలు పార్టీ సిద్ధాంతాల కంటే స్వలాభం కోసమే పాకులాడటం మొదలుపెట్టారు. బడుగులు, బలహీనవర్గాలే మా దేవుళ్లనే ఎన్టీఆర్‌ను చూసి కమ్యూనిస్టు పార్టీల క్యాడర్ కూడా టీడీపీలోకి వలసపోయింది. కమ్యూనిస్టు నేతలు ఒకప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలనే దేబిరించి, రెండు మూడు సీట్లు గెలుచుకుని సంపద పోగేసుకోవడం ప్రారంభించారు. ప్రజాఉద్యమాల ఊసే మరిచిపోయి పేపర్ టైగర్లుగా మిగిలిపోయారు.
ఇప్పుడు మొత్తానికి పోయింది
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్నది కమ్యూనిస్టులే. ఏపీలో టీడీపీ, వైసీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలదే హవా. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పోరాడుతున్నాయి. కానీ, కమ్యూనిస్టులకు మాత్రం చోటు కనాకష్టమైపోయింది. ఇప్పుడు నడుస్తున్న తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో ఒక్క కమ్యూనిస్టు ఎమ్మెల్యే కూడా లేరు.
పొత్తుల కోసం ఆరాటం
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని కమ్యూనిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ శ్రేణులను ఉరుకులు పెట్టించి మరీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కీలకమయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా గులాబీ నేతల కంటే ఎక్కువగా ప్రభుత్వ విధానాలను పొగిడారు. తీరా సీట్ల పంపకానికి వచ్చేసరికి కేసీఆర్ వీళ్లను లైట్ తీసుకున్నారు. ఇక లాభం లేదనుకుని కాంగ్రెస్ వైపు వెళదామంటే వాళ్లూ అంత ఇష్టంగా లేరు. మరీ బతిమాలితే ఒకటో రెండో సీట్లు రావచ్చేమో.. ఏపీలో అయితే వైసీపీ కమ్యూనిస్టులున్నారని గుర్తించడానికి కూడా ఇష్టపడదు. టీడీపీ దయతలిచి ఇస్తే సీపీఐకి ఒకటో, రెండో టికెట్లు ఇవ్వచ్చు. లేకపోతే అదీ లేదు. ఈ పరిస్థితుల్లో వరుసగా రెండుసార్లు రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిధ్యమే లేకపోతే ఇక కమ్యూనిస్టులు పరిస్థితేంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.