Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్... అసలు లోగుట్టు ఇది!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో ఎప్పుడు చేరతారు ? ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా ? ఈప్రశ్నలపై స్పష్టత ఇవ్వకుండా ఆయన కన్ ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ?

రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజన్... అసలు లోగుట్టు ఇది!
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? బీజేపీలో చేరుతారా ? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసే ప్రకటనలేమో మరింత కన్ఫూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి. రాజీనామా చేస్తానని ఒక సారి, బీజేపీ లో చేరతానని ఒకసారి తాను రాజీనామా చేస్తా అన్నది టీఆరెస్ దుష్ప్రచార‌మని మరో సారి మాట్లాడుతూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు రాజ గోపాల్ రెడ్డి. ఇంత కన్ఫ్యూజన్ కు అసలు కారణం ఏంటి ? ఆయనింకా బీజేపీలో చేరే విషయంలో ఓ నిర్ణయానికి రాలేదా ?

నిజానికి ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకొని చాలా కాలమే అయ్యింది. ఆనాటి నుండే ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై ధ్వజమెత్తుతున్నాడు. బీజేపీ పార్టీని ఆకాశానికెత్తుతున్నాడు. మరి ఎందుకాలస్యమంటే....

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి అన్ని ఒప్పందాలు జరిగిపోయాయి. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్నది బీజేపీ షరతు. అలా జరిగి మునుగోడులో ఉపఎన్నిక వస్తే అక్కడ గెలిచి తమ సత్తా చాటడమే కాక ఆ ఫలితాల సహాయంతో ఉమ్మడి నల్గొండజిల్లాలో కాంగ్రెస్ ను ఖాళీ చేయొచ్చన్నది బీజేపీ ప్లాన్. కానీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తానా లేదా అన్నది రాజగోపాల్ రెడ్డి డౌట్. అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీజేపీలో చేరుతానని ఆయన బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ససేమిరా అనడంతో ఆయనకు దిక్కు తోచడ‍ం లేదు.

కనీసం తనంతట‌ తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండా ఆ పార్టీయే తనను బహిష్కరిస్తే సానుభూతి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అంచనా. ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీనమేశాలు లెక్కబెడుతోంది. మరి ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలిసినా కాంగ్రెస్ ఆయనను ఎందుకు కనీసం సస్పెండ్ చేయడం లేదు ?

రాజ్ గోపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం, బీజేపీని పొగడటం మొదలుపెట్టాడో ఆయనను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే అందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అడ్డుతగులుతున్నారు. ముఖ్యంగా రాజ గోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజ్ గోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా అధిష్టానం దగ్గర చక్రం తిప్పారు. తాము రాజ్ గోపాల్ రెడ్డిని బీజేపీలోకి వెళ్ళకుండా ఆపుతామని అధిష్టానానికి మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇవ్వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డిలు రాజ్ గోపాల్ రెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అటువైపు నుండి వచ్చిన సమాధానం విని వీళ్ళకు కూడా దిమ్మతిరిగిందట.

''ఇక కాంగ్రెస్ పని అయిపోయింది. రాబోయే కాలం బీజేపీదే . మీరు కూడా బీజేపీలోకి రండి, నేను బీజేపీ అధిష్టానంతో మాట్లాడి మీకు మంచి పొజిషన్లు ఇప్పిస్తాను.'' అని ఉత్తమ్ తో రాజ్ గోపాల్ రెడ్డి అన్నాడని సమాచారం. దాంతో ఏం చేయాలో అర్దంకాని ఉత్తమ్, వంశీ చందర్ లు ఉత్త చేతులతో వెనక్కి వచ్చారు.

ఇక ఇప్పుడు జరగాల్సింది ఏంటి ? కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఆయనను సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అధిష్టానం కూడా అటువైపే మొగ్గు చూపుతోంది. అందువల్ల కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళాలని, ఒక వేళ కాంగ్రెస్ సస్పెండ్ చేయకపోయినా పదవికి రాజీనామా చేసి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆయనకు ఇష్టం లేకపోయినా తప్పడం లేదన్నది ఆయన అనుచరులు చెప్తున్న మాట.

ఇక ఆయన ప్రజల్లోకి వెళ్ళి తాను రాజీనామా చేస్తేనే మునుగోడు నియోజక వర్గానికి నిధులు వస్తాయని అందుకే మీ కోసం రాజీనామా చేశాననే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్ళాలని ప్రణాళిక వేసుకున్నారు.

అయితే మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చాలామందికి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ విషయాన్ని వాళ్ళు ఆయన మొహం మీదే చెప్పేశారు.ఆయన బీజీలో చేరితే వీళ్ళలో చాలా మంది ఆయనతో వెళ్ళకపోవచ్చ‌ని కాంగ్రెస్ నాయకత్వం అంచనా. దీంతో ఉప ఎన్నిక వస్తే రాజ్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ల మధ్య ఓట్ల చీలిక వచ్చి టీఆరెస్ గెలుస్తుందన్నది టీఆరెస్ నాయకుల ధీమా. మరి ఎవరి అంచనాలు విజయవంతం అవుతాయో? ఎవరి ధీమాలు నిజమవుతాయో అసలు రాజగోపాల్ రెడ్డి తన కన్ ఫ్యూజన్ నుంచి ఎప్పుడు బైట ప‌డతారో అతి త్వరలోనే తెలిసిపోతుంది.

First Published:  30 July 2022 1:41 PM IST
Next Story