ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు బీజేపీలో ఇమడలేక పోవడానికి.. ఆ బ్యాచే కారణమా?
సీనియర్ నాయకులు, చురుకైన నేతలుగా ముద్రపడిన అనేక మంది బీజేపీలో చేరగానే సైలెంట్ అయిపోతున్నారు. కనీసం బయట కార్యక్రమాల్లో కూడా వాళ్లు ఏనాడూ బీజేపీ కండువాతో కనపడటం లేదు.
తెలంగాణ బీజేపీలోకి ఇతర పార్టీ నేతలు ఎంత వేగంగా చేరుతున్నారో.. అంతే వేగంగా పార్టీని వీడి పోతున్నారు. అసలు ఒక్కోసారి సదరు నేత రాజీనామా చేసే దాక అతడు బీజేపీలో ఉన్నాడా అనే విషయం కూడా కార్యకర్తలకు అర్థం కావడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో, కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రాదనే అనుమానంతో అనేక మంది బీజేపీలో చేరారు. కానీ, ఆయా నేతలు ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారని అర్థం అవుతోంది. సీనియర్ రాజకీయ నాయకులు కూడా బీజేపీ అంతర్గత రాజకీయాలకు తట్టుకోలేక త్వరగానే పార్టీని విడిచిపెడుతున్నారు.
సీనియర్ నాయకులు, చురుకైన నేతలుగా ముద్రపడిన అనేక మంది బీజేపీలో చేరగానే సైలెంట్ అయిపోతున్నారు. కనీసం బయట కార్యక్రమాల్లో కూడా వాళ్లు ఏనాడూ బీజేపీ కండువాతో కనపడటం లేదు. దీనిక కారణం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. బీజేపీలోని అంతర్గత రాజకీయాలు.. హై కమాండ్‌ను కలవాలంటే ఉండే అవాంతరాల కారణంగా పార్టీని వదిలేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీది ప్రత్యేక శైలి. ఇక్కడ అనేక మంది ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ కలిగిన నాయకులు ఉంటారు. వారిది భావజాల పరంగా కూడా విభిన్నశైలి. అలా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీలో మొదటి నుంచి పాతుకొని పోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బ్యాచే. రాష్ట్ర బీజేపీలో దాదాపు వీళ్లదే పెత్తనం. కేంద్రంలోని అమిత్ షా, జేపీ నడ్డాలను కలవాలంటే ఈ బ్యాచ్‌ను దాటుకొని వెళ్లాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఒకటి రెండు వారాల్లోనే తమ పరిస్థితి ఏంటనేది అర్థం అయిపోతోంది. అనవసరంగా వచ్చి పార్టీలో ఇరుక్కొని పోయామని మదనపడుతున్న నాయకులు కూడా ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు.
ఇతర పార్టీలను బలహీన పరచడానికి బీజేపీ వాళ్లను పార్టీలో చేర్చుకుంటోంది. భావజాలపరంగా పార్టీలో ఇమడలేరని తెలిసి కూడా ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే ఈ చేరికలు ఉంటున్నాయి. బీజేపీ వ్యూహం ఏంటో తెలిసే సరికే సదరు నాయకులు తమ రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోతున్నారు. మనసు చంపుకొని ఆ పార్టీలో ఉండలేక చాలా మంది సొంత గూటికి చేరిపోతున్నారు. తెలుగుదేశంలో అగ్రనాయకుల్లో ఒకరిగా చలామణి అయిన నాగం జనార్థన్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిన తర్వాత పూర్తిగా కనుమరుగు అయ్యారు. ఎర్ర శేఖర్, మోత్కుపల్లి నర్సింహులు, పెద్ది రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, బోడ జనార్థన్, రాపోలు ఆనంద్ భాస్కర్, బండ్రు శోభారాణి, పుష్ఫలీల, విజయారెడ్డి వంటి నాయకులు బీజేపీలో చేరినా.. అక్కడి రాజకీయాలు తట్టుకోలేక బయటకు వచ్చేశారు.
ఇప్పటికే తెలంగాణ బీజేపీలో ఉన్న సీనియర్, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ బ్యాచ్.. ఈ వలస నాయకులను ఎదగనీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ వలస వచ్చిన నాయకులకు ఏదైనా పదవి ఇచ్చినా.. పార్టీ నుంచి సరైన సపోర్ట్ ఉండటం లేదని తెలుస్తోంది. దీంతో కొత్తగా వచ్చిన నాయకులు తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని బాధపడుతున్నారు. బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ నాశనం చేసుకున్నామనే బాధతోనే పార్టీని విడిచిపెడుతున్నారు.
మరోవైపు బీజేపీ సిద్ధాంతాలు వంట బట్టించుకోవడం ఇతర పార్టీ నేతలకు అంత తేలికైన విషయం కాదు. అలాంటి దూకుడును కూడా ప్రదర్శించడం కష్టం. ఇన్నాళ్లూ గౌరవప్రదమైన రాజకీయాలు చేసిన నాయకులు.. బీజేపీలో చేరి మరోలా వ్యవహరించాల్సి రావడం కష్టంగా మారింది. పార్టీలో ఉండే భిన్న వాతావరణాన్ని ఆకలింపు చేసుకోలేక.. పార్టీలో ఉండలేక తమ దారి తాము చూసుకుంటున్నారు. బీజేపీలో చేరి ఇప్పటికీ కొనసాగుతున్న జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్ వంటి నాయకులకు బీజేపీ అగ్రనాయకత్వంతో కాస్తో కూస్తో సంబంధాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర బీజేపీలో వీళ్లను పట్టించుకునే నాథుడే లేడు. వీళ్ల మాటలను ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా వినడం లేదు.
రేపు గెలిచినా, ఓడినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా అదే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీలోని ఆ సీనియర్ల బ్యాచ్ బారిన పడి తప్పించుకోవడం ఎవరి వల్లా కాదని.. అందుకే పార్టీలో చేరిన చాలా మంది కొంత కాలానికే బయటకు వచ్చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదర్చక పోతే మాత్రం తెలంగాణలో బీజేపీ పుంజకోవడం కష్టమనే వాదన కూడా వినిపిస్తోంది. మరి అధిష్టానం ఈ విషయంలో ఏం చేస్తుందో వేచి చూడాలి.