కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక అసలు వ్యూహం ఏంటి?
జాతీయ పార్టీ పెట్టగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమలు సీఎం కేసీఆర్ సహా పార్టీలో ఎవరికీ లేవు. కానీ మోడీ లాంటి వ్యక్తిని ఢీకొడుతున్నారనే ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గిపోయి.. తమ వాడిని గెలిపించుకోవాలని ప్రజలు భావిస్తారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన నిధులను కూడా రాకుండా అడ్డుకుంటోంది. రైతులు, నిరుద్యోగులు, పేదలు బీజేపీ ప్రభుత్వం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కేంద్రంలో ఓ రైతు ప్రభుత్వం, పేదల పక్షపాత ప్రభుత్వం రావల్సిన అవసరం ఉందని ఇటీవల పలు బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలని కోరారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్.. దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన చేయాలని భావిస్తున్నారు. భారత వికాస సమితి, నయా భారత్ పార్టీ వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. టీఆర్ఎస్‌ను పోలి ఉండే బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పేరుకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నిక నుంచే బీఆర్ఎస్ పార్టీని రంగంలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దసరా రోజు ప్రకటన వెలువడే వరకు దానిపై కచ్చితమైన సమాచారం లేదు. కాగా, కేసీఆర్ ఇప్పుడే జాతీయ పార్టీ ప్రకటన ఎందుకు చేస్తున్నారు? రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న టీఆర్ఎస్‌ను నిర్వీర్యం చేసి కొత్త పార్టీని స్థాపించడం ఆత్మహత్యసదృశ్యం కాదా? అని అందరి మనసులో అనుమానం మెదులుతోంది. కానీ దీని వెనుక కేసీఆర్ కచ్చితమైన వ్యూహం ఉన్నదని మాత్రం తెలుస్తోంది. తెలంగాణలో ఇంటింటికీ టీఆర్ఎస్ పార్టీ, దాని గుర్తు, దాని జెండా తెలుసు. అసలు తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ.. ఆయన పార్టీ టీఆర్ఎస్ అని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అలాంటిది టీఆర్ఎస్‌ను పక్కన పెడితే భారీ నష్టం కలగదా? ఇది ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక కూడా ఓ సెంటిమెంట్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా.. సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఇవ్వాళ తెలంగాణ రైతుల కోసం రైతు బంధు, ఉచిత విద్యుత్ అమలులో ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఇటీవల అనేక ఉద్యోగ నోటిఫకేషన్లు కూడా వేశారు. ఇవన్నీ మరోసారి టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొని వస్తాయి కదా అని అందరూ అనుకుంటున్నారు. కానీ వరుసగా రెండు సార్లు, దాదాపు 10 ఏళ్లు అధికారంలో ఉండే ఏ ప్రభుత్వపై అయినా కాస్త వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వాడుకొనే గెలుస్తుంటాయి. టీఆర్ఎస్ పార్టీపై ఉద్యమ పార్టీగా ఎంత అభిమానం ఉన్నా.. ఈ మధ్య కాస్త వ్యతిరేకత కూడా కనపడుతోంది.
ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్, సంక్షేమ పథకాలు అంటూ ఎన్నికల బరిలోకి దిగితే గెలవడం కాస్త కష్టమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేస్తే టీఆర్ఎస్‌కు భంగపాటు తప్పదు. అదే సమయంలో రాష్ట్ర ప్రజలను మరో సెంటిమెంట్‌తో ఆకట్టుకోవాలి. కేంద్రంలోని బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకత కనపడుతోంది. అలాంటి బీజేపీని గద్దె దింపాలని, ఢీ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఓ తెలంగాణ బిడ్డ కేంద్రంలో రాజకీయాలను శాసించడానికి వెళ్తున్నాడు. ఆయనకు మనం తప్పకుండా సపోర్ట్ చేయాలనే సెంటిమెంట్ రగల్చాలి. అదే సమయంలో తెలంగాణను కేసీఆర్ వదిలేస్తున్నారనే భావన ప్రజల మనసుల్లోకి రానివ్వకూడదు. అందుకే జాతీయ పార్టీని తెరపైకి తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో అధికారం చేజారకుండా.. మోడీపై నేరుగా ఢీకొన్ని నేతగా పేరు తెచ్చుకునే అవకాశం కేవలం జాతీయ పార్టీ వల్లే వస్తుంది.
జాతీయ పార్టీ పెట్టగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమలు సీఎం కేసీఆర్ సహా పార్టీలో ఎవరికీ లేవు. కానీ మోడీ లాంటి వ్యక్తిని ఢీకొడుతున్నారనే ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గిపోయి.. తమ వాడిని గెలిపించుకోవాలని ప్రజలు భావిస్తారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలాగో తమకు ఓట్లు తెచ్చిపెడుతుంది. అదే సమయంలో ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటే అవి కూడా జాతీయ పార్టీ దెబ్బకు తుడిచి పెట్టుకొని పోతుందని కేసీఆర్ అనుకుంటున్నారు. కారు గుర్తు, గులాబీ జెండానే జాతీయ పార్టీకి ఉంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా కేసీఆర్ అనుకుంటున్నారు. ఇన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే కేసీఆర్ జాతీయ పార్టీకి మొగ్గు చూపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.