Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ఎంత?

తెలంగాణలో సింగరేణి కార్మాకులు, వారి కుటుంబాలకు చెందిన ఓట్లు భారీగా ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ఎంత?
X

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏయే ప్రాంతాల్లో ఏయే వర్గాలకు చెందిన ఓటర్లు ప్రభావం చూపిస్తారో అనే లెక్కలను ఆయా రాజకీయ పార్టీలో బేరీజు వేస్తున్నాయి. కుల, మతాలకు అతీతంగా తెలంగాణలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన ఓట్లు భారీగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీరి ప్రభావం కచ్చితంగా గెలుపోటములను నిర్ణయించనున్నది. మొత్తం 25 స్థానాల్లో సింగరేణి కుటుంబాల ప్రభావం ఉంటుంది. ఇందులో 12 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు ఉన్నాయి.

ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో దాదాపు 6 లక్షల మంది సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు ఉన్నాయి. ములుగు, చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, పరకాల, ఆదిలాబాద్, సిర్పూర్, బోథ్, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో కూడా సింగరేణికి సంబంధించిన కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీరు తప్పకుండా ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి స్థానాల్లో విజయం సాధించింది. మంథని, ఆసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఇల్లెందు, పినపాకలో కాంగ్రెస్ పార్టీ, సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ, రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విజయం సాధించింది. అయితే మంథని తప్ప మిగిలిన నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు. దాదాపు వీళ్లకే బీఆర్ఎస్ మరోసారి టికెట్లు కేటాయించింది. మంథని నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ టికెట్ కన్ఫార్మ్ చేసింది.

బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 ఏళ్ల పాలనలో సింగరేణి కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కార్మికులకు లాభాల్లో వాటాలను, బోనస్‌లను భారీగా పెంచింది. అంతే కాకుండా వేజ్‌బోర్డు బకాయిలను కూడా చెల్లించింది. సుదీర్ఘ కాలంలో పెండింగ్‌లో ఉన్న వారసుల ఉద్యోగాలను భర్తీ చేసింది. అంతే కాకుండా పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచింది. ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణాలను మంజూరు చేసింది. ఇలా కార్మికుల కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

మరోవైపు సింగరేణి ప్రాంతాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల బస్సు యాత్ర చేపట్టారు. కార్మికులతో గేట్ మీటింగ్‌లో కూడా పాల్గొన్నారు. కార్మికుల ప్రయోజనం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలా సింగరేణి ఓటర్ల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను ఆయా పార్టీల ముందు పెడుతున్నారు. స్పష్టమైన హామీలు ఇచ్చే పార్టీవైపే తమ మొగ్గు ఉంటుందని చెబుతున్నారు. సింగరేణి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే రాష్ట్రంలోని 12 నియోజవర్గాల్లో ఆ అభ్యర్థి గెలుపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  31 Oct 2023 7:35 AM IST
Next Story