తెలంగాణపై పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత..?
గోదావరి వరద ప్రభావంపై అధ్యయనం చేసి భద్రాచలం తదితర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
పోలవరం ఏపీకి వరదాయినే. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకమునుపే తెలంగాణను వణికిస్తోంది. ఇటీవల గోదావరికి వచ్చిన వరదలతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా పోలవరం బ్యాక్ వాటర్ భద్రాచలం వరకు ప్రభావాన్ని చూపించింది. గతంలో ఎప్పుడూ ముంపుబారిన పడని ప్రాంతాలు కూడా ఈసారి బ్యాక్ వాటర్ ప్రభావానికి గురయ్యాయి. వర్షాలు లేకపోయినా వరదల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర సర్వేకు సిద్ధపడింది. నిపుణుల కమిటీ నియమించింది.
నిపుణుల కమిటీ ఏర్పాటు..
గోదావరి వరద ప్రభావంపై అధ్యయనం చేసి భద్రాచలం తదితర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. గోదావరిపై సమగ్రంగా సర్వే చేయడంతోపాటు నీటి ప్రవాహం, బ్యాక్ వాటర్ ప్రభావం తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయబోతోంది.
కరకట్టల నిర్మాణం కోసం..
భద్రాచలం వద్ద గోదావరికి కరకట్టలు నిర్మించడానికి రూ.950 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే గోదావరిపై స్రక్చర్లు, కరకట్టలను ఎక్కడెక్కడ నిర్మించాలనే విషయంలో సమగ్ర అధ్యయనం జరగాలని సూచించారు సీఎం కేసీఆర్. ఆయన సూచనల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్ రావు దీనికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
గోదావరి కుడి గట్టున 38.5 కిలోమీటర్లు.. అంటే బూర్గంపాడు మండంలోని సంజీవరెడ్డిపాలెం నుంచి, అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లె వరకు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఎడమ గట్టున 21 కిలోమీటర్ల వరకు.. అంటే ఎటపాక గ్రామం నుంచి దుమ్ముగూడెం గ్రామం వరకు అధ్యయనం చేస్తారు. ఈ నెల 26వ తేదీలోగా అధ్యయనం పూర్తి చేసి వరద ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వరద ప్రభావం కొనసాగుతున్నందున 26లోపు అధ్యయనం పూర్తవుతుందా లేక కొన్నిరోజులు గడువు పొడిగిస్తారా అనేది చూడాలి.