Telugu Global
Telangana

దిక్కుతోచని స్థితిలో రాజాసింగ్.. నెక్ట్స్ స్టెప్‌ ఏంటి..?

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఏ క్షణమైనా ఎత్తివేస్తారని.. ఆయనకు గోషామహల్‌ నుంచి మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది.

దిక్కుతోచని స్థితిలో రాజాసింగ్.. నెక్ట్స్ స్టెప్‌ ఏంటి..?
X

రాజాసింగ్‌.. 2018 అసెంబ్లీలో బీజేపీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. కానీ, ఐదేళ్లు తిరిగే సరికి ఆయన పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఈసారి ఎన్నికల్లో రాజాసింగ్‌కు బీజేపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు నియోజ‌కవర్గాల వారీగా దరఖాస్తు చేసుకోవాలని కిషన్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ గడువు ఆదివారంతో ముగియనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు బీజేపీ ఆఫీసులో దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుల గడువుకు మరికొన్ని గంటలు మాత్రమే టైమ్‌ ఉంది. అయితే రాజాసింగ్‌ విషయంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆయనపై ఇప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో రాబోయే ఎన్నికల్లో రాజాసింగ్‌ పోటీ చేయరని తెలుస్తోంది.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఏ క్షణమైనా ఎత్తివేస్తారని.. ఆయనకు గోషామహల్‌ నుంచి మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ ఆయన సస్పెన్షన్‌పై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక తాను సెక్యూలర్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని రాజాసింగ్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని భావోద్వేగానికి గురయ్యారు. ఇంటాబయటా కొందరు తాను అసెంబ్లీకి రావొద్దని కోరుకుంటున్నారని కామెంట్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈసారి పోటీ నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోషామహల్‌ నియోజకవర్గ పరిస్థితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆసక్తిగా గమనిస్తున్నాయి. గోషామహల్‌ అభ్యర్థిని బీఆర్ఎస్‌ ఇంకా ఫైనల్ చేయలేదు. గోషామహల్ నుంచి మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గోషామహల్‌ నుంచి బీజేపీ తరపున విక్రమ్‌ గౌడ్ పోటీ చేస్తారని సమాచారం. విక్రమ్‌గౌడ్‌కు లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది. వరుసగా రెండు సార్లు గోషామహల్‌ నుంచి విజయం సాధించిన రాజాసింగ్‌కు.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు.

First Published:  10 Sept 2023 12:21 PM IST
Next Story