జహీరాబాద్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? చంద్రశేఖర్‌కు గీతారెడ్డి మద్దతు ఉందా?
వికారాబాద్ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏ.చంద్రశేఖర్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సారి తాను జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారని చెబుతూ.. ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి పలు చోట్ల పాత నాయకులతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులను చేర్చుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పాత టీడీపీ పరిచయాలను వాడుకుంటూ పలువురిని పార్టీలోకి తీసుకొస్తున్నారు. అంతే కాకుండా వారికి ముందస్తుగానే టికెట్ హామీ ఇస్తుండటంతో పాత నాయకులు అసంతృప్తితో ఉన్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో ఇప్పటికే ఇలాంటి డైలమా కొనసాగుతోంది.
వికారాబాద్ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏ.చంద్రశేఖర్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సారి తాను జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారని చెబుతూ.. ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాలుగు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, ఒక సారి బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాజీ మంత్రి చంద్రశేఖర్ వ్యవహార శైలి ఇప్పుడు జహీరాబాద్ కాంగ్రెస్‌లో కాకపుట్టిస్తోంది. జహీరాబాద్ నుంచి 2009, 2014లో గెలిచిన గీతారెడ్డి వర్గం నుంచి చంద్రశేఖర్‌కు మద్దతు లభించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
గీతారెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. కానీ జహీరాబాద్‌లో తన వర్గం వారికి టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో చంద్రశేఖర్ పార్టీలో చేరడం, జహీరాబాద్‌పై ఫోకస్ చేయడంతో గీతారెడ్డి అసహనంతో ఉన్నట్లు సమాచారం. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా చంద్రశేఖర్‌కు టికెట్ హామీ ఇస్తారని మండిపడినట్లు తెలుస్తున్నది.
మరోవైపు చంద్రశేఖర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గీతారెడ్డి ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ సభ్యురాలు కానీ అవుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా గీతారెడ్డి కోపానికి కారణమని తెలుస్తున్నది. తన రాజకీయ భవిష్యత్‌ను నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారు డిసైడ్ చేయడం ఏంటని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది. మరోవైపు చంద్రశేఖర్ మాత్రం నియోజకవర్గంలో పలు సమావేశాలను నిర్వహిస్తూ కాంగ్రెస్ నాయకుల మద్దతును కూడగట్టే పనిలో ఉన్నారు.
ఇప్పటికే గీతారెడ్డి వర్గాలనికి చెందిన పలువురు నాయకులను చంద్రశేఖర్ సంప్రదించారని.. తను గెలిస్తే అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తానని.. తప్పకుండా తనకు మద్దతు తెలిపాదని కోరినట్లు సమాచారం. కాగా, గీతారెడ్డి సహకరించక పోవడంపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులకు కూడా చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాను గీతారెడ్డికి వ్యతిరేకం కాదని.. అందరినీ కలుపుకొని పోతానని.. కానీ తనకు మాత్రం నియోజకవర్గంలో సహాయ నిరాకరణ జరుగుతోందని ఆవేదన చెందినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాట్లలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉండటంతో.. జహీరాబాద్ వ్యవహారాన్ని ఆ తర్వాత చూద్దామని చెప్పినట్లు సమాచారం.