Telugu Global
Telangana

మునుగోడులో ఏం జరుగుతోంది? జర్నలిస్ట్ గ్రూప్ క్షేత్ర స్థాయి పరిశీలన

ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం తుఫాను ముందు ప్రశాంతతలాగ పూర్తిగా సైలెంట్‌గా ఉన్నది. యుద్దం ముందు సైనికులు ఎలా సిద్ధం అవుతారో.. ప్రజలు కూడా అలా పోలింగ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు.

మునుగోడులో ఏం జరుగుతోంది? జర్నలిస్ట్ గ్రూప్ క్షేత్ర స్థాయి పరిశీలన
X

తెలంగాణ ప్రజలు ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక మీదే చర్చించుకుంటున్నారు. నెలన్నరకు పైగా రాజకీయ పార్టీలన్నీ మునుగోడు సమరం కోసం తీవ్రంగా శ్రమించాయి. చండూరులో సీఎం కేసీఆర్ సభ ముగిసిన తర్వాత ప్రచారానికి కూడా గడువు తీరిపోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో స్థానికేతరులకు అసలు ఎంట్రీనే లేదు. బయటి నుంచి మునుగోడులోకి ఎంటర్ కావాలంటే ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులు పరిశీలించిన తర్వాతే పోలీసులు ఓకే చెప్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొంత మంది జర్నలిస్టులు మునుగోడు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సంస్థాన్ నారాయణ్‌పూర్, గట్టుప్పల, చౌటుప్పల్, చండూర్ మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. స్థానికులతో మాటలు కలిపి అక్కడ ఏలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

కొంత కాలంగా రాజకీయ విశ్లేషణలు, సర్వేలు చేస్తున్న హైదరాబాద్ జర్నలిస్టులు దిల్‌షుక్‌నగర్ నుంచి హయత్‌నగర్, దండు మైలారం, సంస్థాన్ నారాయణ్‌పూర్, గట్టుప్పల, శివన్నగూడెం, చౌటుప్పల్, కొయ్యలగూడం ప్రాంతాలకు వెళ్లారు. ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం తుఫాను ముందు ప్రశాంతతలాగ పూర్తిగా సైలెంట్‌గా ఉన్నది. యుద్దం ముందు సైనికులు ఎలా సిద్ధం అవుతారో.. ప్రజలు కూడా అలా పోలింగ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు. కొన్ని వారాలుగా అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల ప్రచారాలతో మార్మోగిన నియోజకవర్గం.. ఇప్పుడు ప్రశాంతంగా కనపడుతోంది. కూలీకి, పనులకు, ఉద్యోగాలకు వెళ్లేవారు తమ రోజు వారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అయితే ఎవరిని కదిలించినా.. ఎన్నికల మాటలే చెప్తుండటం గమనార్హం.

దండుమైలారంలో జర్నలిస్టు గ్రూప్ పాతిక మందితో మాట్లాడింది. సగం మందికి పైగా అధికార టీఆర్ఎస్‌కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కొంత మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇక సంస్థాన్ నారాయణ్‌పూర్ దగ్గరలో ఉన్న తండాల్లో పూర్తిగా టీఆర్ఎస్ ఫేవర్‌గా ఉన్నారు. అదే మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ సొంత ఊరు ఉన్నది. అక్కడ ఆసక్తికరంగా కాంగ్రెస్‌కు ఓట్లేస్తాం అని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. కేసీఆర్ అభిమానులే తప్ప ఆ పార్టీ అభ్యర్థిపై ఆసక్తి చూపిన వాళ్లు సంస్థాన్ నారాయణపూర్ మండలంలో కనపడకపోవడం గమనార్హం. కొత్తగూడ, పుట్టపాక, గట్టుపల్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ వైపు చాలా మంది మొగ్గు చూపారు. శివన్నగూడెంలో గులాబీ పార్టీకి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.

జర్నలిస్టు గ్రూప్ అక్కడి నుంచి చండూరులో ఉన్న మరికొంత మంది మిత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అటు వైపు కాంగ్రెస్ అభిమానులు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదని, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ప్రచారంలో ఎక్కువగా పాల్గొనలేదని క్షేత్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లే వస్తే మేము మరింతగా పని చేసే వాళ్లం అన్నా.. అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మొదట్లో కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని భావించినా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాల్వాయి స్రవంతి భారీగా ఓట్లను కూడగట్టుకొని రెండో స్థానానికి వచ్చేలా కనపడుతోంది.

టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, కేసీఆర్ చండూరు సభ ఆ పార్టీకి కలిసి వస్తోంది. కానీ చాలా మంది అభ్యర్థి కూసుకుంట్లపై వ్యతిరేకత చూపించడం గమనించదగిన విషయం. మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి చాలా కష్టపడి పని చేసినట్లే కనపడుతోంది. అక్కడ ఎవరిని కదిలించినా.. మంత్రి పేరే చెప్తున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే.. ఆ క్రెడిట్ మంత్రికి ఇచ్చినా తప్పులేదనే అనిపించింది. ఇక కేసీఆర్ పథకాల లబ్దిదారులు కారు గుర్తుకే వేస్తామని బల్లగుద్ది చెప్పారు.

కానీ.. మునుగోడు, చౌటుప్పల్ ప్రాంతాల్లో బీజేపీ బలం కనపడుతోంది. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో బీజేపీకి కాస్త బలం పెరిగింది. అయితే ఈ ఓట్లు రాజగోపాల్ రెడ్డిని మాత్రం గెలిపించలేక పోవచ్చు. అదే సమయంలో టీఆర్ఎస్ ఓట్లను తగ్గించే అవకాశం ఉన్నది. మొత్తంగా ఈ పరిశీలన తర్వాత జర్నలిస్టు గ్రూప్ ఒక అంచనాలు వచ్చింది. టీఆర్ఎస్ గెలుపు 15 వేల నుంచి 20 వేల మెజార్టీతో ఉండొచ్చని.. కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని అనుకుంటున్నారు. బీఎస్పీ వల్ల చాలా వరకు ఓట్లు చీలే అవకాశం ఉన్నది. కానీ అది అంతిమంగా అధికార పార్టీకే లాభం చేకూరుస్తుంది.

First Published:  31 Oct 2022 3:27 PM IST
Next Story