Telugu Global
Telangana

విమోచనం.. విలీనం.. శాంతి ర్యాలీ.. సెప్టెంబర్ 17న ఏం జరుగుతుంది..?

తెలంగాణ ఏర్పడిన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా విమోచనం, విలీనం అంటూ హడావిడి చేయని బీజేపీ నేతలు.. ఇప్పుడు విమోచన దినాన్ని భారీ ఎత్తున చేసేందుకు సై అంటున్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

విమోచనం.. విలీనం.. శాంతి ర్యాలీ.. సెప్టెంబర్ 17న ఏం జరుగుతుంది..?
X

నిజాం సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనం అయిన సెప్టెంబర్ 17వ తేదీ ఈసారి హైదరాబాద్‌లో ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుందోనన్న అనుమానాలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. తెలంగాణలో అలజడికి పక్కా ప్లాన్‌తో వస్తున్నారు అమిత్ షా. తెలంగాణ ఏర్పడిన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా విమోచనం, విలీనం అంటూ హడావిడి చేయని బీజేపీ నేతలు.. ఇప్పుడు విమోచన దినాన్ని భారీ ఎత్తున చేసేందుకు సై అంటున్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రాబోతున్న అమిత్ షా.. ఒక రోజు ముందుగా అంటే ఈనెల 16న హైదరాబాద్ వస్తున్నారు. అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, అప్పటి నిజాం సంస్థానంలో ఉన్న కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకూ ఆహ్వానాలు పంపించారు.

విమోచనమా.. విలీనమా..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినం జరపాలనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవం జరపాలనుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న విలీన వజ్రోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో కూడా నిర్ణయం తీసుకున్నారు. విలీన దినోత్సవం సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోబోతున్నారు.

ఎంఐఎం శాంతి ర్యాలీ..

సెప్టెంబర్ 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా విమోచన, విలీన దినోత్సవాలు జరపడానికి సిద్ధం కాగా.. అదే రోజు శాంతి ర్యాలీ నిర్వహించడానికి ఎంఐఎం నేతలు రెడీ అంటున్నారు. పాతబస్తీ ప్రాంతంలో శాంతి ర్యాలీ చేపడతామన్నారు. స్వాతంత్ర పోరాటంలో హిందూ, ముస్లిం నాయకులు కలసికట్టుగా పాల్గొన్నారని, వారి పోరాటాల స్ఫూర్తిని ఆరోజు గుర్తు చేసుకుంటామని అన్నారు. విలీన వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు కూడా.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలకు పోతే అసలు సెప్టెంబర్ 17న ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. కేంద్రం పంతానికి పోయి రాష్ట్రంపై దండెత్తినట్టు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తానంటోంది. ఈ దుస్సాహసానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపడుతోంది. మధ్యలో ఎంఐఎం శాంతి ర్యాలీ అంటోంది. ఈ మూడు కార్యక్రమాలతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

First Published:  6 Sept 2022 8:04 PM IST
Next Story