Telugu Global
Telangana

ప్రముఖ మీడియా సంస్థలు కూడా వాట్సప్ లో వచ్చే ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తే ఎలా ?

ఈ వార్త వాట్సప్ లోనే కాకుండా ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల్లో కూడా విపరీతంగా ప్రచారం చేశారు. ఆశ్చర్యంగా ఈ వార్తను ప్రచారం చేసింది ఎక్కువగా...ప్రతి వార్తలో నిజముందా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని ప్రచురించే, ప్రసారం చేసే జర్నలిస్టులే.

ప్రముఖ మీడియా సంస్థలు కూడా వాట్సప్ లో వచ్చే ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తే ఎలా ?
X

ఈ మధ్య కొద్ది రోజులుగా ఓ వార్త వాట్స‌ప్ గ్రూపుల్లో విపరీతంగా తిరుగుతోంది. ఈ వార్త గతంలో కూడా ఇలాగే వైరల్ అయ్యింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాతో ఆగకుండా ప్రముఖ మీడియా ఛానల్ కూడా ఆ వార్తను ప్రసారం చేసింది. ప్రతీ వార్తను యునెస్కో కు అంటగట్టి ప్రచారం చేసే వాట్సప్ యూనివర్సిటీ ప్రభుద్దులు ఈ సారి ఏకంగా భారత‌ సుప్రీం కోర్టు పేరునే ఈ ఫేక్ వార్తలోకి లాగారు.

ఇంతకీ వార్త ఏంటంటే....? ''జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.'' అనేది వార్త

ఈ వార్త వాట్సప్ లోనే కాకుండా ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల్లో కూడా విపరీతంగా ప్రచారం చేశారు. ఆశ్చర్యంగా ఈ వార్తను ప్రచారం చేసింది ఎక్కువగా...ప్రతి వార్తలో నిజముందా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని ప్రచురించే, ప్రసారం చేసే జర్నలిస్టులే.

సోషల్ మీడియా ప్రచారంతో ఆగలేదు. నిన్న ఒక ప్రముఖ తెలుగు ఛానల్ ఆ వార్తను ప్రసారం చేసింది. అసలు నిజంగానే సుప్రీం కోర్టు ఆ తీర్పు ఇచ్చిందా ? ఇస్తే సుప్రీం కోర్టు వెబ్ సైట్ లో గానీ ఉందా ? లేక కోర్టుల తీర్పులన్నింటిని పోస్ట్ చేసే పలు వెబ్ సైట్లు ఏమైనా ఈ వార్తను పోస్ట్ చేశాయా ? లేక దేశంలోని ఏదైనా పత్రిక ప్రచురించిందా ? ఏ ఛానల్ అయినా ప్రసారం చేసిందా ? ఏ వెబ్ సైట్ అయినా పోస్ట్ చేసిందా ? ఇలాంటి వివరాలేవీ తెలుసుకోకుండా కనీసం వారి ఢిల్లీ కరస్పాండెంట్ ద్వారా సుప్రీం కోర్టు లాయర్లతో మాట్లాడి విషయం తెలుసుకోకుండా ఈ వార్తను ప్రసారం చేయడం ఎంత బాధ్యతా రాహిత్యం !

నిజానికి ఇలాంటి తీర్పేదీ సుప్రీం కోర్టు ఇవ్వలేదు. ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్య్రం, బావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) నే జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది.

ఒక్క‌ మహారాష్ట్ర ప్రభుత్వం తప్ప దేశంలోని ఏ రాష్ట్రం కానీ, కేంద్రం కానీ జ‌ర్నలిస్టుల‌ భద్రత కోసం ఎలాంటి చట్టం చేయలేదు. ఏ కోర్టు కూడా దీనిపై తీర్పులు ఇవ్వలేదు. మహా రాష్ట్ర ప్రభుత్వం 2017 లో మహారాష్ట్ర మీడియా పర్సన్స్ అండ్ మీడియా ఇనిస్టిట్యూషన్స్ (హింస , నష్టం లేదా ఆస్తినష్టం నివారణ) చట్టం చేసింది. 2019 లో రాష్ట్ర పతి ఆమోదం పొందింది. ఆ చట్టం కింద మీడియా వ్యక్తులపై, వారి ఆస్తిపై ఏదైనా హింసాత్మక చర్య జరిగితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు/లేదా నేరస్థుడికి 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

ఇది తప్ప జర్నలిస్టుల భద్రత‌కు సంబంధించి మరే చట్టాలు లేవు, ''జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.'' అనే వార్త పూర్తిగా అబద్దం.

వాట్సప్ యూనివర్సిటీ పట్టభ‌ద్రులను ఎలాగూ ఆపలేము, కనీసం మీడియా అయినా బాధ్యతాయుతంగా వార్తల ప్రచురణ, ప్రసారం చేస్తే ప్రజలకు మేలు చేసిన వారవుతారు.

First Published:  28 Nov 2022 6:20 PM IST
Next Story