Telugu Global
Telangana

ఎండల నుంచి రిలీఫ్.. ఆ రెండు రోజులు వర్షాలు

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్‌, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఎండల నుంచి రిలీఫ్.. ఆ రెండు రోజులు వర్షాలు
X

వారం రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం బయటకు రావాలంటే మండుటెండకు మాడు పగిలిపోతోంది. ఈ నేప‌థ్యంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉందని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

కాగా రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ఎఫెక్ట్‌ జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్‌, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5-8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

First Published:  4 April 2024 12:40 PM IST
Next Story