Telugu Global
Telangana

ఎన్నికల తర్వాతే బీఆర్ఎస్‌తో పొత్తు గురించి ఆలోచిస్తాం : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

ఎన్నికల అనంతరమే బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలా లేదా అనే విషయం తేలుస్తామని చెప్పారు.

ఎన్నికల తర్వాతే బీఆర్ఎస్‌తో పొత్తు గురించి ఆలోచిస్తాం : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు ఖాయమని ప్రతి ఒక్కరు అంచనా వేస్తారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న ఏఐఎంఐఎం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మిత్ర పక్షంగా మారింది. ప్రభుత్వంలో లేకపోయినా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై మాత్రం ఏనాడూ విమర్శలు చేయలేదు. అయితే, తాజాగా నిజామాబాద్ వెళ్లిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్.. ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలులో ఉన్న వారిని పరామర్శించడానికి నిజామాబాద్ వచ్చిన ఓవైసీ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేవలం ఓల్డ్ సిటీలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎంఐఎం బలంగా ఉన్న ప్రతీ చోటా పోటీ చేస్తామని తెలిపారు.

ఎన్నికల అనంతరమే బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలా లేదా అనే విషయం తేలుస్తామని చెప్పారు. మా క్రికెట్ మేం ఆడతాం.. బ్యాటింగ్ చేసి మా స్కోర్ మేం తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఎవరిని ఔట్ చేయాలనేది నిర్ణయిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. పవర్ మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.

బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ హత్యాయత్నం చేశారు. కానీ ఎంఐఎం నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారని ఓవైసీ ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో షకీల్, కల్వకుంట్ల కవిత కోసం ఎంఐఎం కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా మా కార్యకర్తలే బీఆర్ఎస్‌కు ఓట్లు వేయించారని చెప్పారు. కానీ, ఇప్పుడు అదే కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఓవైసీ మండిపడ్డారు.

తెలంగాణలో ఎక్కడెక్కడ పోటీ చేస్తామనే వివరాలు త్వరలోనే ప్రకటిస్తాము. ముందుగా ఎంఐఎం బలపడటానికి పని చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ తర్వాతే ఏ పార్టీతో కలిసి వెళ్లేది నిర్ణయించుకుంటామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఓవైసీ పేర్కొన్నారు.

First Published:  26 Jun 2023 7:07 PM IST
Next Story