Telugu Global
Telangana

నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తానని చెప్పారని మంత్రి దయాకర్ రావు తెలిపారు.

నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
X

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ తప్పకుండా పరిహారం చెల్లించి ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులను ఆయన బుధవారం కలిసి భరోసా ఇచ్చారు. వారితో మాట్లాడి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. వడగళ్ల వానతో రైతులకు భారీ నష్టం కలగడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. పంటలు చేతికి వచ్చే సమయానికి ఇలా వర్షం కురవడం బాధకరమని చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమని, కేసీఆర్ రైతుల పక్షపాతి.. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తానని చెప్పారని మంత్రి తెలిపారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను ఆదేశించారని చెప్పారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సమీక్ష చేస్తున్నారని దయాకర్ రావు చెప్పారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని.. అందుకే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో ఉన్నారని మంత్రి వివరించారు. రైతులు నష్టపోకుండా నివేదికలు పంపాలని ఆయన అధికారులకు సూచించారు.

అధికారులు చేసే సర్వే ఆధారంగానే రైతులకు నష్టపరిహారం అందుతుందని దయాకర్ రావు చెప్పారు. అందుకే ఆ నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించి సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఒక్క రైతు కూడా మిస్ కాకుండా నివేదిక పొందు పరచాలని కోరారు. ఇవ్వాళ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తారని మంత్రి చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన ఓదారుస్తారని.. అలాగే పంట నష్టాన్ని కూడా స్వయంగా చూస్తారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.


First Published:  23 March 2023 12:53 AM GMT
Next Story