Telugu Global
Telangana

3వేలిస్తాం ఓటు వేయండి.. బీజేపీ అఫిషియల్ ట్వీట్..!!

అదేంటి సారు.. 10వేలన్నారు, 12వేలన్నారు, చివరికి 20వేలన్నారు, తులం బంగారం కూడా అన్నారు కదా, ఇప్పుడేంటి 3వేలంటున్నారు అంటూ మరో మహిళ ప్రశ్నించింది. ఇంకో మహిళ బంగారంపై భలే జోకు పేల్చింది.

3వేలిస్తాం ఓటు వేయండి.. బీజేపీ అఫిషియల్ ట్వీట్..!!
X

అది సెల్ఫ్ డబ్బా అనుకున్నారు కానీ, అది సెల్ఫ్ గోల్. మూమూలు గోల్ కాదు, ఘోరమైన గోల్. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మునుగోడు ఓటుకి 3వేల రూపాయలు లెక్కగట్టారు, అంతే కాదు నిస్సిగ్గుగా ఆ వీడియోని తనకు తానే బయటపెట్టుకున్నారు. ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే.. ఆయన ట్వీట్ ని బీజేపీ తెలంగాణ హ్యాండిల్ నుంచి అధికారికంగా రీట్వీట్ చేయడం. తీరా పరువు పోయిన తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసినా ఉపయోగం లేదనుకోండి.

ఆ ట్వీట్ లో ఏముంది..?

పత్తిచేలో కూలిపనికి వెళ్తున్న మహిళలను బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ తన కారులో కూర్చోబెట్టుకున్నారు. వారందర్నీ చేను దగ్గర దించి వారితో పిచ్చాపాటీ మాట్లాడారు. ఏమమ్మా.. ఓటుకి 3వేలు ఇచ్చారు కదా తీసుకున్నారా అని ప్రభాకర్ అడిగారు. మాకివ్వలేదు అని ఓ మహిళ సూటిగా చెప్పేసింది. అదేంటి సారు.. 10వేలన్నారు, 12వేలన్నారు, చివరికి 20వేలన్నారు, తులం బంగారం కూడా అన్నారు కదా, ఇప్పుడేంటి 3వేలంటున్నారు అంటూ మరో మహిళ ప్రశ్నించింది. ఇంకో మహిళ బంగారంపై భలే జోకు పేల్చింది. సూర్యాపేటలోని తన మనవరాలు ఫోన్ చేసిందని, మునుగోడులో ఓటు వేస్తే బంగారం ఇస్తున్నారంటకదా, అది తనకే ఇవ్వాలంటూ మనవరాలు మారాం చేసిందని నవ్వుతూ చెప్పింది. ఏమీలేని సంబడానికి ఎన్నెన్ని ప్రచారాలో అంటూ నిట్టూర్చింది.

ఈ వీడియోలో ప్రభాకర్ నిస్సుగ్గుగా మహిళలతో ఓటుకి నోట్లు పంచుతున్నామని చెప్పారు, అంతే కాదు, ఆయన ఆ వీడియోని తీసి, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "పత్తి చేలలో పనిచేయటానికి కూలీలుగా వెళుతున్న మహిళలను కారులో కూర్చోబెట్టుకొని వారి చేను వద్ద దించి వారితో పాటు పత్తిని ఏరుతున్న ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ చూసి ఇందులో ఏదో విషయం ఉందనుకొని బీజేపీ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి దాన్ని రీట్వీట్ చేశారు. ఇదిగో ఇలా దొరికిపోయారు.

ఫినిషింగ్ టచ్..

ఈ ట్వీట్ కి ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. పత్తిచేలో మహిళల్ని దించిన ప్రభాకర్ వారితో ఫొటో దిగాలనుకున్నారు. పత్తి ఏరుతున్నట్టు ఫొటో దిగితే బాగుంటుందని అసిస్టెంట్ సూచించాడు. చివరకు చేను దగ్గరకు వెళ్లారు కానీ అక్కడ కుదర్లేదు. దీంతో వెనక్కి వచ్చేశారు ప్రభాకర్. మహిళా కూలీలను కారులో తీసుకెళ్లి తానేదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా బిల్డప్ ఇవ్వాలనుకున్నారు ప్రభాకర్. తనతోపాటు, రాష్ట్ర పార్టీని కూడా ఇలా ఇబ్బంది పెట్టారు.

First Published:  1 Nov 2022 8:51 AM GMT
Next Story