మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
నదికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నమూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్
మూసీ నిర్వాసితులను అన్నిరకాలుగా ఆదుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన తదితర అంశాలపై ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మూసీకి వరదలు భారీగా వచ్చేవి. అప్పట్లోనూ నిర్వాసితులను తరలించారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు. ఇటీవల ఖైరతాబాద్‌లో 20 నిమిషాల్లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చిన్న వానలకే హైదరాబాద్ ముంపునకు గురవుతున్నది. నగరంలో ప్రస్తుతం కోటి జనాభా ఉన్నదన్న ఆయన మూసీ పరివాహక ప్రాంతం మురికి కూపంలా మారిందన్నారు. దాన్ని మార్చాలన్నారు. మూసీకి వరదలు వస్తే ఇబ్బంది పడేది ప్రజలే అన్నారు. కుంచించుకుపోయిన మూసీని విస్తరించడమే మా లక్ష్యమని తెలిపారు. మూసీ సుందరీకఱన ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకువెళ్తామన్నారు.
55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణం
2030 వరకు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుతుంది. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 2026 జూన్‌లోపు మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేయడానికి రూ. 3,800 కోట్లు వ్యయం చేస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే పార్కులు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్లు నిర్మిస్తాం. దీంతో నగరంలో ట్రాఫిక్ తగ్గుతుంది. మూడు నెలల కిందట మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు 55 కి.మీ మేర డ్రోన్ సర్వే చేసి సుమారు 10, 600 ఇళ్లు, నిర్మాణాలు.. బఫర్ జోన్, రివర్ బెడ్‌లో ఉన్నాయని గుర్తించారు. ఏదో ఒక రోజు వారిని ఖాళీ చేయాల్సిందేనని దానకిషోర్ స్పష్టం చేశారు.
నిర్వాసితులకు రూ. 30 లక్షల విలువ చేసే ఇండ్లు
నిర్వాసితుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల నుంచి 30 లక్షల విలువ చేసే ఇండ్లు ఇస్తున్నాం. నిర్వాసితుల్ని ఎవరినీ బలవంతంగా తరలించలేదన్నారు. వారితో సామరస్యంగా మాట్లాడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామని వివరించారు. హై్డ్రా అధికారులు చట్టానికి లోబడే పనిచేస్తున్నారు. మూసీ ఆధునికీకరణకు ప్రజలంతా సహరించాలని దానకిషోర్ విజ్ఞప్తి చేశారు.