రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాం
రైతులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాష్ట్రంలోని రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని, రైతులు ప్రతిపక్షాల మాయలో పడొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో అనంతగిరి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, మిగతా వాళ్ల రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులు ఇప్పుడు అభివృద్ధికి అడ్డం పడుతున్నాయని అన్నారు. అనంతగిరిని రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తామని, పర్యావరణానికి హాని కలుగకుండా ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వం అనంతగిరి గుట్టపై మెడికల్ కాలేజీ ప్రతిపాదిస్తే పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందనే వికారాబాద్ సమీపంలోని మెటల్ గండిలో నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.