సింగరేణిపై కేంద్రం కుట్రను భగ్నం చేస్తాం, అందరిని కలుపుకొని పోరాటాలు చేస్తాం - కేటీఆర్
సింగరేణి బొగ్గు గనుల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగు బొగ్గు గనులను తమకే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రులకు లేఖ రాసినప్పటికీ మోడీ సర్కార్ ప్రైవేటు వైపే మొగ్గు చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు.
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని తాము భగ్నం చేస్తామని కేటీఆర్ అన్నారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ, సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను, కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని సింగరేణి ప్రవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
సింగరేణి బొగ్గు గనుల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగు బొగ్గు గనులను తమకే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రులకు లేఖ రాసినప్పటికీ మోడీ సర్కార్ ప్రైవేటు వైపే మొగ్గు చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆ నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తామని ఆ వేలంలో మీరు కూడా పాల్గొనాలని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని కేటీఆర్ అన్నారు.
''సింగరేణి కార్మికులకు మాట ఇస్తున్నాం, ఎంత కష్టమైనా సరే, ఎంతవరకు వెళ్ళాల్సి వచ్చినా సరే, అందరిని కలుపుకొని పోరాడుతాం. సింగరేణిని ప్రవేటుపరం చేయాలన్న కేంద్రం కుట్రలను భగ్నం చేస్తాం.'' అని కేటీఆర్ అన్నారు.
విభజన హామీల్లో ఒకటైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం మాటతప్పడమే కాకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ''బయ్యారంలో స్టీల్ నిక్షేపాలే లేవని కేంద్రం అబద్దాలు ప్రచారం చేస్తున్నది. అయినా సరే, కేంద్రం తెలంగాణ పట్ల ఎంత వివక్ష చూపించినా సరే, స్వంతంగా మేము తెలంగాణను అభివృద్ది చేస్తాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని అవసరమైతే మేమే నిర్మిస్తాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరలో బయ్యారం విషయం పై జిందాల్, మిట్టల్ లతో సంప్రదింపులు చేశాం. ప్రైవేటు రంగంలోనైనా, సింగరేణి ద్వారానైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి తీరుతాం.'' అనికేటీఆర్ స్పష్టం చేశారు.