'పొంగులేటి చేసిన ఆర్థిక నేరాలపై సీబీసీఐడీ విచారణ కోరుతాం'
పొంగులేటి గురువు వైఎస్ఆర్ కూడా బీఆర్ఎస్ (ఆనాడు టీఆర్ఎస్)ను చీల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తాతా మధు గుర్తు చేశారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారం ఎత్తిన రోజు నుంచి ఇప్పటి వరకు అనేక భూదందాలకు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. పొంగులేటి చేసిన నేరాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని తాను సీఎం కేసీఆర్‌ను కోరతానని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కొనే వ్యక్తి ఏ జన్మలోనూ ఉండబోరని ఆయన వెల్లడించారు.
పొంగులేటి గురువు వైఎస్ఆర్ కూడా బీఆర్ఎస్ (ఆనాడు టీఆర్ఎస్)ను చీల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తాతా మధు గుర్తు చేశారు. పొంగులేటి తన స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కే కమీషన్లు ఇచ్చానని చెప్పడం అంతా బూటకమని విమర్శించారు. చీమలపాడులో జరిగిన ఘటనను రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్సీ మధు హెచ్చరించారు.
తన కూతురు వివాహ పత్రిక ఇవ్వడానికి ప్రగతిభవన్ వెళ్తే.. సీఎం కేసీఆర్ కనీసం ఆహ్వాన పత్రికను కూడా తీసుకోలేదని పొంగులేటి చెప్పడం తన స్థాయికి తగునా అని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ స్వయంగా పత్రికను తీసుకున్న ఫొటోను, శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన వివాహన వేడుకకు మంత్రి కేటీఆర్ హాజరైన ఫొటోను తాతా మధు మీడియాకు చూపించారు. శ్రీనివాసరెడ్డి చేసేవన్నీ తప్పుడు ప్రచారాలే అని చెప్పడానికి ఇవే నిదర్శనమని తాతా మధు చెప్పారు. సీతారామ ప్రాజెక్టుపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్న పొంగులేటి.. ఆ ప్రాజెక్టుకు టెండర్ ఎందుకు వేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.