Telugu Global
Telangana

ప్రజలు గెలిచే రాజకీయం కావాలి.. దేశంలో రాబోయేది మన ప్రభుత్వమే : సీఎం కేసీఆర్

2024లో భారత దేశంలో వచ్చేది మన రాజ్యమే.. ఇలా చెప్పడానికి నాకు ఆత్మవిశ్వాసం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రజలు గెలిచే రాజకీయం కావాలి.. దేశంలో రాబోయేది మన ప్రభుత్వమే : సీఎం కేసీఆర్
X

ప్రజలు గెలిచే రాజకీయం కావల్సిన అవసరం ఇప్పుడు ఉందని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియాలో అధికారంలోకి రాబోయేది మన ప్రభుత్వమే అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకం ఇస్తామని.. ఆ రోజు త్వరలోనే వస్తుందని కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని సాగర తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 వేల మందికి దళిత బంధు ద్వారా లబ్ధి జరిగింది. ఈ ఏడాది మరో 1.25 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎస్సీల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం.. వాస్తవ కార్యచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

నిజంగా పని చేసే వాళ్లను ప్రోత్సహిస్తే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని విషయాలు చెప్పాలంటే మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నా.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పాను. నేను చెప్పినట్లుగానే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసై.. రాష్ట్ర ఏర్పాటు సాకారం అయిన తర్వాతే తెలంగాణకు తిరిగి వచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

ప్రకాశ్ అంబేద్కర్ ఇందాక చాలా విషయాలు చెప్పారు. సీఎం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ రాజకీయాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు తాను పార్టీని విస్తరించినట్లు తెలిపారు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని ప్రకాశ్ అంబేద్కర్ కోరారు. నేను ఒకటే చెబున్నాను.. 2024లో భారత దేశంలో వచ్చేది మన రాజ్యమే.. ఇలా చెప్పడానికి నాకు ఆత్మవిశ్వాసం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

నేను ఇలా చెబుతుంటే శత్రువులకు మింగుడు పడక పోవచ్చు. అయితే.. ఒక్క చిన్న మినుగురు చాలు అంటుకోవడానికి అని గుర్తు చేశారు. ఈ మధ్య మహారాష్ట్ర వెళ్తే నా కలలో కూడా ఊహించని విధంగా ప్రోత్సహం, ఆదరణ వచ్చింది. రేపు యూపీ, బీహార్, బెంగాల్‌లో కూడా అలాంటి ఆదరణ తప్పకుండా వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కలలు సాకారం కావల్సిన అవసరం ఉన్నది. ఆయన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం అని కేసీఆర్ చెప్పారు. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఆయన విశ్వమానవుడు.. అందుకే అంతటి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామని చెప్పారు. ఈ భారీ విగ్రహానికి సమీపంలోనే బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారకం ఉన్నాయి. అలాగే సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నాము. ఇది విగ్రహం కాదు విప్లవమని కేసీఆర్ అభివర్ణించారు.

అంబేద్కర్ పేరిట ప్రతీ ఏటా అవార్డులు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారు. తప్పకుండా ఆయన పేరుతో అవార్డు ఇస్తాం.. అందు కోసం రూ.51 కోట్ల ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతీ ఏడాది అంబేద్కర్ జయంతి రోజు ఉత్తమ సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డు ప్రదానం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్‌ను శాలువాతో సత్కరించి, బుద్దుడి జ్ఞాపికను కేసీఆర్ అందజేశారు.

First Published:  14 April 2023 1:19 PM GMT
Next Story