Telugu Global
Telangana

పాలమూరులో ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత మాదే : మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.

పాలమూరులో ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత మాదే : మంత్రి కేటీఆర్
X

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత మాదే. రాష్ట్రంలో విద్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో 6.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. రైతు రుణ మాఫీ కింద ఇప్పటికే రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేశాము. ఎన్నికల్లోపు అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు 13 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు. పాలమూరును అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు.. ఇవాళ ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందని చెప్పారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. సముద్రతీరం లేకుండా మత్స్య సంపద పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణే నెంబర్ వన్‌గా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్‌ సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఐదు విప్లవాలు వ్యవసాయ రంగాన్ని మార్చేస్తున్నాయని పేర్కొన్నారు.


First Published:  20 Oct 2023 4:50 PM IST
Next Story