ఉద్యోగ కల్పనలో బెంగుళూరును అధిగమించాం : మంత్రి కేటీఆర్
ప్రస్తుతం వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాలను మించి తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో తెలంగాణ దూసుకొని పోతోంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగుళూరును కూడా హైదరాబాద్ అధిగమించింది. నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పని చేయడం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన క్రెడాయ్ ప్రతినిధులతో శనివారం టీ-హబ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో చూపించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకొని పోతోందని వివరించారు. తెలంగాణ ఏర్పడిన నాటికి ఉన్న విద్యుత్, తాగునీరు, సాగునీరు వంటి సంక్షోభాలను ధీటుగా ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేయడం వెనుక పదేళ్ల కృషి ఉందని అన్నారు.
తెలంగాణ కేవలం ఐటీ ఎగుమతులపై మాత్రమే దృష్టి పెట్టలేదని.. వ్యవసాయ రంగాన్ని కూడా ప్రాధాన్యత అంశంగా తీసుకున్నదని చెప్పారు. ప్రస్తుతం వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాలను మించి తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా టీఎస్-ఐపాస్, భవనాల నిర్మాణ అనుమతుల కోసం టీఎస్-బీపాస్‌ను తీసుకొని వచ్చాము. ఈ రెండు విధానాల వల్ల కేవలం 15 రోజుల్లోనే అనుమతులు వస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇలాంటి పాలసీ లేదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణలో అమలు చేస్తున్న ఐపాస్, బీపాస్ పాలసీలను అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేశారు. ఎంతో మంది ప్రముఖులు ఈ పాలసీలను మెచ్చుకున్నారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో బహుళ అంతస్తుల భవనాలు అధికంగా ఉన్నాయి. ఇటీవల స్కైస్క్రేపర్స్ కూడా పెరుగుతున్నాయి. ముంబై తర్వాత అత్యధిక స్కైస్క్రేపర్స్ ఉన్న నగరం హైదరాబాదే అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister @KTRBRS addressing the members of CREDAI Maharashtra at @THubHyd, Hyderabad. https://t.co/kPUzzMqjO4
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 16, 2023