Telugu Global
Telangana

భారత దేశం అభివృద్ది కోసం యుద్దం మొదలు పెట్టాం, క్రైస్తవ సోదరులు అండగా నిలబడాలి -కేసీఆర్

తెలంగాణ అభివృద్ది చెందినట్టే భారత దేశం కూడా అభివృద్ది చెందాలని, దేశాన్ని సరి అయిన మార్గంలో పెట్టడానికి మరో యుద్దం మొదలు పెట్టామని చెప్పిన కేసీఆర్ ఆ యుద్దానికి క్రైస్తవ సోదరులంతా మద్దతుగా నిలబడాలని కోరారు.

భారత దేశం అభివృద్ది కోసం యుద్దం మొదలు పెట్టాం, క్రైస్తవ సోదరులు అండగా నిలబడాలి -కేసీఆర్
X

20 ఏళ్ళ క్రితం అశాంతితో, వలసలతో అల్లకల్లోలంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని చూసి మనం ఆ పరిస్థితి మార్చడానికి యుద్దాన్ని ప్రారంభించాం. ఆ యుద్దంలో మనం విజయం సాధించాం. ఈ 8 ఏళ్ళలో తెలంగాణను చాలా అభివృద్ది చేసుకున్నాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్ మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన అభివృద్ది సాధించిందని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ అభివృద్ది చెందినట్టే భారత దేశం కూడా అభివృద్ది చెందాలని, దేశాన్ని సరి అయిన మార్గంలో పెట్టడానికి మరో యుద్దం మొదలు పెట్టామని చెప్పిన కేసీఆర్ ఆ యుద్దానికి క్రైస్తవ సోదరులంతా మద్దతుగా నిలబడాలని కోరారు. జైభారత్ నినాదంతో దేశంలో పురోగమిద్దామన్నారు కేసీఆర్. క్రైస్తవ సోద‌రుల సమస్యల గురించి పెద్దలు చెప్పారని , క్రైస్తవ మత పెద్దలతో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో, అలాగే జాతీయ స్థాయిలో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కేసీఆర్ అన్నారు.

''మనిషి తనను తాను ప్రేమించుకున్నట్టే ప్రపంచాన్ని ప్రేమించాలని చెప్పిన వాడు జీసస్ క్రైస్త్. క్రీస్తు బోధనలు తూచా తప్పకుండా పాటిస్తే ప్రపంచంలో స్వార్దం , అసూయ ఉండదు. యుద్దాలే జరగవు. జైళ్ళ‌ అవసరం ఉండదు. క్రీస్తు కలలు కన్న ప్రపంచం ఉదాత్తమైనది. ఆయన అనేక హింసల‌కు, అవమానాలకు గురయ్యాడు. స్వంత మనుషుల చేతులో హత్యకు గురయ్యాడు. అయినా చివరి నిమిషం వరకు ప్రజల కోసమే ఆలోచించాడు.క్రీస్తు తరవాత కూడా ఎందరో మహనీయులు అటువంటి సమాజం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మనందరం కూడా అలాంటి భావాలు అలవాటు చేసుకుందాం.'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలోకార్డినల్ పూల అంథోనీ,తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ , మల్లా రెడ్డి, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.

First Published:  21 Dec 2022 8:13 PM IST
Next Story