Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకు ఎలాంటి నష్టం లేదు : సీపీఐ, సీపీఎం

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నాయకులు హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు.

సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకు ఎలాంటి నష్టం లేదు : సీపీఐ, సీపీఎం
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకూడదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల త‌మ‌కు ఎలాంటి నష్టం లేదని సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు అన్నారు. సీఎం కేసీఆర్ మిత్ర ధర్మం పాటించడం మరిచిపోయారని వారు ఆక్షేపించారు. మిత్ర ధర్మంపై సీఎం కేసీఆర్ తప్పకుండా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నాయకులు హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. సమావేశం అనంతరం కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తో పొత్తు చెడిపోయినంత మాత్రాన వ్యక్తిగత దూషణలకు దిగబోమని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వాన్ని విధాన పరంగా వ్యతిరేకిస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో సీఎం కేసీఆరే త‌మ మ‌ద్ద‌తు కోరార‌ని, వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేది అని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కూడా వామపక్షాలు తమ మిత్రపక్షమని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నార‌ని, ఇది తాము ఊహించని పరిణామమని, రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం నాయకుల సత్తా ఏమిటో చూపిస్తామని వారు అన్నారు. ఈ సమావేశంలో జూలకంటి రంగారెడ్డి, జాన్ వెస్లీ, చెరుపల్లి సీతారాములు, సుదర్శన్, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాస్ రావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

*

First Published:  22 Aug 2023 5:45 PM IST
Next Story