Telugu Global
Telangana

చిన్న చిన్న తప్పులు చేశాం.. వాటిని సరిదిద్దుకొని ప్రజలకు దగ్గరవుదాం

బీఆర్‌ఎస్‌ ఇంకో 75 ఏళ్లు ఉంటది : కేటీఆర్‌

చిన్న చిన్న తప్పులు చేశాం.. వాటిని సరిదిద్దుకొని ప్రజలకు దగ్గరవుదాం
X

అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేశామని, వాటిని సరిదిద్దుకొని ప్రజలకు దగ్గరవుదామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమానే కొంప ముంచిందన్నారు. ఈ పార్టీ కేసీఆర్‌.. కేటీఆర్‌ లది మాత్రమే కాదని.. అందరిదని తెలిపారు. ఇంకో 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల పాటు ఈ పార్టీ ఉంటుందన్నారు. తెలంగాణ సాధన కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందని, పోరాటం మనకు కొత్త కాదన్నారు. వైఎస్‌ఆర్‌, చంద్రబాబు లాంటి వాళ్లతోనే కొట్లాడమని, రేవంత్‌ రెడ్డి ఎంత అన్నారు. నదులు ఎక్కడ ఉన్నాయో.. విప్రో చైర్మన్‌ ఎవరో కూడా తెలియని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం మన దౌర్భాగ్యం అన్నారు. దేశంలోనే జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి తెలంగాణాను సాధించుకున్నామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్‌ అక్కున చేర్చుకుంటోందని, వారికి అండగా ఉంటుందని అన్నారు.

జీవో 29తో గ్రూప్‌ -1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వారిని కలిసేందుకు అశోక్‌ నగర్‌ కు పోదామంటే అక్కడ మొత్తం పోలీసులే ఉన్నారని తెలిపారు. అందుకే గ్రూప్‌ -1 అభ్యర్థులే తెలంగాణ భవన్‌ కు వచ్చారని తెలిపారు. వారికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని సీఎం రేవంత్‌ రెడ్డి చీటికి.. మాటికి మూటలు తీసుకొని ఢిల్లీకి పోతున్నాడని అన్నారు. ఇప్పటి వరకు 25 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర ప్రజల కోసం సాధించింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్‌ కంకణం కట్టుకున్నారని అన్నారు. తులం బంగారం ఏమైందని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేదిస్తున్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటేనని అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో రేవంత్‌ రెడ్డి పేదల ఇండ్లు కూల్చుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఢిల్లీలో జుమ్లా పీఎం ఉంటే.. రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని, అందుకే ప్రజలు మనలను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అన్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్‌ఎస్‌ వీ కార్యకర్తలు కాంగ్రెస్‌, బీజేపీలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్‌వీ సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని, కమిటీలు వేసుకోవాలని సూచించారు. తన కన్నా అద్భుతంగా మాట్లాడే నాయకులు బీఆర్‌ఎస్‌వీ లో ఉన్నారని తెలిపారు. మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని, ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఒక్క మీడియా కూడా చూపించడం లేదన్నారు. అందుకే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీలో బీఆర్‌ఎస్‌వీ జెండా, బ్యానర్‌ ఉండాలని, ప్రభుత్వంపై పోరాటంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. డీ లిమిటేషన్‌ తో అసెంబ్లీలో సీట్లు పెరుగుతాయని, అప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చే వారికి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడుల సమాచారం ఎందుకు బయటికి రావడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ తోడు దొంగలనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ అన్నారు.

First Published:  17 Oct 2024 3:02 PM IST
Next Story