Telugu Global
Telangana

ఏపీ భవన్ విషయంలో తగ్గబోమని తెగేసి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తాత్కలిక విభజననే పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏపీ అధికారులు పట్టుబడుతున్నారు. తెలంగాణ అధికారులు మాత్రం ఇందుకు సమ్మతించడం లేదు.

ఏపీ భవన్ విషయంలో తగ్గబోమని తెగేసి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
X

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో తగ్గబోమని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు కావొస్తున్నా.. ఇంకా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశాలు నిర్వహించింది. తాజాగా బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ అధ్యక్షతన ఏపీ భవన్ విభజనకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. తెలంగాణ తరపున ఉన్నతాధికారులు రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి ఆదిత్యానాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ పాల్గొన్నారు.

ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ను గతంలోనే తాత్కాలికంగా 58:42 నిష్ఫత్తిలో విభజించారు. గదులు, స్థలం విభజించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాత్కలిక విభజననే పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏపీ అధికారులు పట్టుబడుతున్నారు. తెలంగాణ అధికారులు మాత్రం ఇందుకు సమ్మతించడం లేదు. జనాభా నిష్పత్తిలోనే ఆస్తుల పంపకం జరగాలని చట్టంలో ఉన్నట్లు ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, నిజాం నవాబు ఆస్తి అయిన ఈ భవంతిలో ఏపీకి వాటా ఇవ్వడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

దేశ రాజధానిలో అశోకా రోడ్డులో దాదాపు 19.5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ భవన్ ఉన్నది. నిజాం నవాబు నిర్మించిన ఈ భవనం హైదరాబాద్ ప్రిన్లీ స్టేట్‌కు చెందినది. అయితే, 1956లో భాషాప్రయోక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏపీ భవన్‌గా మారింది. ఇప్పుడు తిరిగి రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి.. ఆ భవనం, స్థలం మొత్తం తెలంగాణకే చెందాలని ప్రభుత్వం వాదిస్తోంది. నిజాం ఆస్తులపై ఏపీ పెత్తనం ఎందుకు ఉంటుందని గతంలో సీఎం కేసీఆర్ కూడా వాదించారు.

ఏపీ భవన్, స్థలం విలువ దాదాపు రూ.1 లక్షన్నర కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఏపీకి దాదాపు 11.32 ఎకరాలు, తెలంగాణకు 8.41 ఎకరాలు దక్కే అవకాశం ఉంటుంది. పూర్తిగా హైదరాబాద్ స్టేట్‌కు చెందిన ఈ విలువైన ఆస్తిని కోల్పోవడం తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే ఏపీ భవన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టువిడవటం లేదు. కాగా, ఈ విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణ అందుకు అంగీకరిస్తుందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఏది ఏమైనా ఏపీ భవన్ విషయంలో తమ ధోరణి మార్చుకునే ప్రసక్తి లేదని కేంద్రం, ఏపీకి తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. ఇవ్వాల్టి సమావేశంలో సమస్య కొలిక్కి రాకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.

First Published:  26 April 2023 1:13 PM
Next Story