Telugu Global
Telangana

అన్ని రంగాల్లో మనమే నంబర్ 1 స్థానంలో ఉన్నాం : పట్టణ ప్రగతి వేడుకల్లో మంత్రి కేటీఆర్

రూ.71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాము. ఈ బడి ద్వారా తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసే విధానం.. కంపోస్టు ఎరువును ఎలా తయారు చేయాలనే అంశాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

అన్ని రంగాల్లో మనమే నంబర్ 1 స్థానంలో ఉన్నాం : పట్టణ ప్రగతి వేడుకల్లో మంత్రి కేటీఆర్
X

సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగానే 9 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నది. కేసీఆర్ నాయకత్వంలో పరిశ్రమలు, భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో తెలంగాణ పునరాగమనంలో ఉన్నదని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి వేడులకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

రూ.71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాము. ఈ బడి ద్వారా తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసే విధానం.. కంపోస్టు ఎరువును ఎలా తయారు చేయాలనే అంశాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్వచ్ఛ బడి కాన్సెప్ట్‌ను సిద్దిపేటలో ప్రారంభించిన డాక్టర్ శాంతిని.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌గా నియమిస్తున్నట్లు వేదిక మీద ప్రకటించారు. ఈ స్వచ్ఛ బడి కార్యక్రమాన్ని అందరు మున్సిపల్ కమిషనర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ఏక కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు ప్రారంభించారు. టీఎస్ ఐ-పాస్ తరహాలో బిల్డింగ్ నిర్మాణాలకు టీఎస్ బీ-పాస్‌ను తీసుకొని వచ్చాము. ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణాలకు అవకాశం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. 9 ఏళ్ల పాలనలోనే తెలంగాణ సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి సాధించామని కేటీఆర్ చెప్పారు. ఇవాళ హైదరాబాద్ నగరం.. బెంగళూరును కూడా పక్క పెట్టి.. ఐటీ రంగంలో ముందంజ వేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు ఒకే సారి 150 వార్డు కార్యాలయాలను ప్రారంభించాము. ఇవి తప్పకుండా విజయవంతం అవుతాయి. గ్రేటర్ పరిధిలోని ప్రతీ అధికారి చిత్తశుద్ధితో, పట్టుదలతో పని చేస్తున్నారు. దేశంలోని ప్రతీ మున్సిపల్ అధికారి వచ్చి.. హైదరాబాద్‌లోని మన వార్డు కార్యాలయాలను ప్రశంసిస్తారనే నమ్మకం ఉందని మంత్రి చెప్పారు. తెలంగాణ ఆచరిస్తుంది.. ఇండియా అనుసరిస్తుందనే నానుడిని నిజం చేయబోతున్నామని కేటీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధును ఎలాగైతే ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయో.. త్వరలో వార్డు కార్యాలయ వ్యవస్థను కూడా ఇతరులు ఆచరిస్తారని కేటీఆర్ చెప్పారు.

మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న టీఎస్ బీ-పాస్ చట్టం గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తెలుసుకొని ఆశ్చర్యపోయారు. 9 ఏళ్ల కాలంలో మున్సిపల్ మంత్రిగా నేను, మా అధికారులు కానీ ఎక్కడా తప్పు పనులు చేయలేదు. అవినీతిరహితంగా పాలనను కొనసాగిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మొన్న హెలీకాప్టర్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి కరీంనగర్ వెళ్లాను. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లను చూపెట్టాను. దీని వల్ల ఇప్పుడు తెలంగాణ మత్స్య సంపదలో దేశంలోనే నంబర్ 1గా ఉందని చెప్తే.. వైవీ సుబ్బారెడ్డి ఆశ్చర్యపోయారు. సినీ స్టార్ రజనీకాంత్‌ కూడా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను చూసి.. ఇది న్యూయార్క్‌లాగా అనిపించిందని కితాబిచ్చారు.

మన రాష్ట్రం, హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే.. అధికారులు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టపడటమే అని కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్ నగరంలో 22 వేల మంది శానిటేషన్ సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా సమయంలో బయటకు వచ్చి వాళ్లు నగరాన్ని శుభ్రంగా ఉంచారు. దేశంలోనే అత్యధిక వేతనం అందుకునేది మన శానిటేషన్ కార్మికులే అని కేటీఆర్ చెప్పారు. సఫాయి కార్మికులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అలాగే.. మున్సిపాలిటీలకు ఉన్న పాత డంపింగ్ యార్డులను పూర్తిగా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని కేటీఆర్ చెప్పారు.

First Published:  16 Jun 2023 2:02 PM
Next Story