Telugu Global
Telangana

తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.. జాతీయ సమైక్యత దినోత్సవంలో సీఎం కేసీఆర్

ఇండియాలో హైదరాబాద్ అంతర్భాగం అయిన రోజునే జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము. ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలు.. సామాన్యులు అసమాన్యులై చేసిన త్యాగాలు తెలంగాణ జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని కేసీఆర్ అన్నారు.

తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.. జాతీయ సమైక్యత దినోత్సవంలో సీఎం కేసీఆర్
X

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించడం చరిత్ర నాకు అందించిన మహదావకాశం. రాష్ట్రం సాకారమైన దగ్గర నుంచి సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుల నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం.. సీఎం కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ చరిత్రంలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇండియాలో హైదరాబాద్ అంతర్భాగం అయిన రోజునే జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము. ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలు.. సామాన్యులు అసమాన్యులై చేసిన త్యాగాలు తెలంగాణ జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని కేసీఆర్ అన్నారు. దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్య దాకా.. కుమ్రం భీమ్ నుంచి రావి నారాయణరెడ్డి వరకు.. షోయబ్ ఉల్లాఖాన్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి వరకు.. స్వామీ రామానంద తీర్థ నుంచి జమలాపురం కేశవరావు దాకా.. బండి యాదగిరి, సుద్దాల హనుమంతి, కాళోజీ, దాశరథుల వరకు ఎందరో వీర యోధులు, త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.

రాష్ట్రంలో మానవీయ కోణంలో అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నాము. ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదు. ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా మారింది. అభివృద్ధి అంటే ఏమిటో అనతి కాలంలోనే చేసి చూపించాము. ఈ రోజు తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తోందనే మాట అక్షర సత్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. పాలమూరు పచ్చగా మారింది. ఎన్నో అడ్డంకులు అధిగమించి పాలమూరును పూర్తి చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుతో 6 జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్ారు. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్ జిల్లాకు త్వరలోనే సాగు నీరు అందిస్తామన్నారు. 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని అన్నారు.

హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాము. వాటిని పంపిణీ దశల వారీగా జరుగుతోందని అన్నారు. తెలంగాణ వైద్య విద్యలో కూడా ముందు ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకొని వచ్చిన సంస్కరణలతో ప్రతీ జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయని అన్నారు. తెలంగాణ నుంచి ఏటా 10 వేల మంది డాక్టర్లను తెలంగాణ తయారు చేస్తోందని చెప్పారు.

దళిత బంధు పథకం ద్వారా దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. దళిత బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ నంబర్ 1గా ఉందని చెప్పారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని.. పెన్షన్ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లు తగ్గించినట్లు చెప్పారు.

First Published:  17 Sept 2023 12:24 PM IST
Next Story