Telugu Global
Telangana

ఆగస్టు 31లోపు 100 శాతం ఎస్టీపీ నగరంగా హైదరాబాద్

ఎస్టీపీల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని హైదారాబాద్ మెట్రొపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 31లోపు 100 శాతం ఎస్టీపీ నగరంగా హైదరాబాద్
X

దేశంలోనే 100 శాతం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీ)లు కలిగి ఉన్న నగరంగా హైదరాబాద్ త్వరలో రికార్డు సృష్టించబోతోంది. హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగు నీరు నేరుగా మూసీ, ఇతర జలాశయాల్లో కలవకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేశారు. అగస్టు నెలాఖరులోగా మొత్తం 31 ఎస్టీపీలు వినియోగంలోకి రానున్నాయి. దీంతో హైదరాబాద్ 100 శాతం ఎస్టీపీలు ఉన్న మొట్టమొదటి ఇండియన్ సిటీగా రికార్డులకు ఎక్కనున్నది.

ఎస్టీపీల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని హైదారాబాద్ మెట్రొపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎస్టీపీలను ఆయన పరిశీలించారు. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తయ్యాయని.. సివిల్ పనులతో పాటు, మెషినరీ ఇన్‌స్టాలేషన్ దాదాపు చివరి దశకు వచ్చిందని ఆయన చెప్పారు. ఆగస్టు 31లోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అవసరం అయితే మ్యాన్‌పవర్ పెంచి పనులు వేగంగా చేపట్టాలని సూచించారు.

ఎస్టీపీలు నిర్మిస్తున్న ప్రాంతంలో పార్కులు కూడా ఏర్పాటు చేసి.. పచ్చదనాన్ని పెంచాలని కోరారు. ఎస్టీపీల చుట్టూ అలంకార మొక్కలు పెంచడం వల్ల చుట్టు పక్కల కాలనీల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని సూచించారు. 31 ఎస్టీపీల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు.

ఫతేనగర్ ఎస్టీపీ 11 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇది రోజుకు 133 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తుంది. బాలానగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సురారం, జగద్గిరిగుట్ట నుంచి వచ్చే మురుగు నీటిని ఈ ఎస్టీపీనే ట్రీట్ చేయనున్నది. దాదాపు 9.59 లక్ష మంది జనాభాకు ఈ ఎస్టీపీ సేవలు అందించనున్నది. ఈ ఎస్టీపీలో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించారు. మురుగు నీటిని ఐదు దశల్లో ఇది శుద్ది చేస్తుంది. ఇందుకోసం ఒకటే చాంబర్ వాడుకుంటుంది. అందుకే ఈ అత్యాధునిక ఎస్టీపీ చిన్న స్థలంలోనే ఏర్పాటు చేయడానికి వీలుపడింది.

హైదరాబాద్ అర్భన్ ఏరియా పరిధిలో ప్రస్తుతం రోజుకు 1,950 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,650 మిలియన్ గ్యాలన్లు ఉత్పత్తి అవుతుండగా.. ప్రస్తుతం పని చేస్తునన 25 ఎస్టీపీల ద్వారా 772 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. మిగిలిన ఆరు ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే.. 100 శాతం మురుగు నీటిని శుద్ది చేయడానికి వీలుంటుంది.

First Published:  30 May 2023 10:06 AM IST
Next Story