Telugu Global
Telangana

మూసీని మా రక్తంతో కడిగి అలంకరిస్తారా?

కేటీఆర్‌ ఎదుట వాపోయిన మూసీ నిర్వాసితులు

మూసీని మా రక్తంతో కడిగి అలంకరిస్తారా?
X

మూసీని తమ రక్తంతో కడిగి అలంకరించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని హైదర్‌ గూడ ప్రాంతంలోని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి తదితరులతో కలిసి సోమవారం సాయంత్రం మూసీ బాధితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. వారందరికీ బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన తాము అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. 1920 నుంచి 2020 వరకు మూసీలో ఎలాంటి సమస్య రాలేదని, 2020 అక్టోబర్‌ లో కురిసిన భారీ వర్షంతో సమస్యలు తలెత్తాయన్నారు. అప్పుడు కూడా మూసీ పరిసరాల్లో నివాసం ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇండ్లను కూలగొడుతోందన్నారు. మార్కింగ్‌ చేసిన ఇండ్ల విలువ లెక్కిస్తే రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేయాలని రేవంత్‌ రెడ్డిని ఎవరు అడిగారో చెప్పాలన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ కు రూ.25 వేల కోట్లు పంపడానికే రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు అని రేవంత్‌ అంటున్నారని అన్నారు. ప్రభుత్వ బుల్డోజర్లకు తాము అడ్డుగా ఉంటామని, ప్రజలు ధైర్యం కోల్పోవద్దన్నారు.





కాంగ్రెస్‌ పాలన అంటే కర్ఫ్యూ ఉండేదని, కేసీఆర్‌ సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ ను గెలిపించారనే రేవంత్‌ వాళ్లపై కక్ష పెంచుకున్నారని అన్నారు. యూపీలో బుల్డోజర్‌ రాజ్‌ నహీ చలేగా అనే రాహుల్‌ గాంధీ తెలంగాణలో అదే బుల్డోజర్‌ రాజ్‌ ను ఎలా నడిపిస్తున్నారని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో తిట్లను చూస్తే మనిషి అనేటోడు ఎప్పుడో సచ్చిపోతుండే అన్నారు. హైడ్రా కమిషనర్‌ మూసీతో సంబంధం లేదని ప్రకటన చేశారని.. మరి పీకనీకి మర్కింగ్‌ చేశారో చెప్పాలన్నారు. ప్రజలంతా సంఘటితంగా ప్రభుత్వంతో కొట్లాడాలని అన్నారు. 18 వేల ఇండ్లు కూల్చేస్తామని ప్రభుత్వం అంటోందని.. ఏ ఒక్కరి ఇల్లు కూడా కూల్చినివ్వబోమని తేల్చిచెప్పారు. పేదల ఇల్లు కూల్చేసి పెద్ద మాల్స్‌ కడుతావా అని మండిపడ్డారు. బాధితులను తక్కువ చేసేలా మంత్రులు మాట్లాడుతున్నారని, ఇకనైనా పిచ్చి ప్రకటనలు మానుకోవాలన్నారు. రేవంత్‌ మగాడైతే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. హైడ్రా, మూసీ బాధితుల వార్తలను మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కూడా చూపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల శక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని అన్నారు. రైతుల శక్తి ముందు మోదీ ప్రభుత్వమే నిలబడలేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. బాధితుల పక్షాన సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.





First Published:  30 Sept 2024 2:17 PM GMT
Next Story